విజయవాడలోని ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయానికి అరుదైన గౌరవం దక్కింది. దేశంలోనే ఉత్తమ సేవా విభాగంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ నుంచి ఈ కార్యాలయానికి పురస్కారం లభించింది. జూన్ 24వ తేదీన దిల్లీలో జరిగిన పాస్‌పోర్టు సేవా దివస్ కార్యక్రమంలో విదేశాంగశాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ చేతుల మీదుగా అవార్డును విజయవాడ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి శివహర్ష అందుకున్నారు.
ఈ విషయాన్ని విజయవాడలో విలేకరుల సమావేశంలో శివహర్ష తెలిపారు. 2023-24లో రికార్డుస్థాయిలో 3.75 లక్షల పాస్‌పోర్టులను జారీ చేయడం ద్వారా ఈ ఘనత సాధించినట్లు వెల్లడించారు. ‘దేశంలోని 37 పాస్‌పోర్టు రీజియన్ కార్యాలయాల పరిధిలో అంతకుముందు ఏడాది కంటే 15 శాతం అధికంగా జారీ చేయగా, విజయవాడలో 20 శాతం దాటడం గొప్ప విషయం. 13 పోస్టాఫీసు సేవాకేంద్రాలు, విజయవాడ, తిరుపతిలోని పాస్‌పోర్టు కార్యాలయాల ఆధ్వర్యంలో ఈ ఘనత సాధించామం. దరఖాస్తు చేసుకున్న తర్వాత కేవలం రెండు మూడు రోజుల్లో పాస్‌పోర్టును జారీ చేసే దిశగా ప్రయత్నిస్తున్నాం. ప్రస్తుతం 600 మందికి సేవలు అందిస్తున్నాం.’ అని శివహర్ష తెలిపారు.