రైలు బండి జోరుగా పోతోంది
హాల్టింగులు ఉండవు
ముఖ్యమయిన రైళ్లు ఆగవు
సరకు రవాణాకు తప్ప ఈ ప్రాంతం లైన్లను
ప్రయాణికుల సౌకర్యార్థం వారి రాకపోకల నిమిత్తం
ట్రైన్లు నడపరు.. కేవలం ఉత్తరాంధ్ర ప్రాంతం వారికో ఆదాయ వనరు
అంతకుమించి ఏం కాదు. కానీ ఇక్కడి భావోద్వేగంతో మాత్రం పనిలేదు
ఇవాళ సార్వత్రిక బడ్జెట్ కు సంబంధించి కీలక ఉపన్యాసం ఇవ్వనున్నారు నిర్మలా సీతారామన్. ఈ దశలో దేశాన్ని ఏవిధంగా నడిపించనున్నారో? ఎటువంటి పన్నులు వేయనున్నారో? పన్ను మినహాయింపులు ఏ విధంగా ఉండనున్నాయో తదితర ప్రశ్నలకు సంబంధించి ఓ చర్చ నడుస్తోంది. ఇదే సమయంలో గతంలో కేంద్రం ఇచ్చిన హామీ నెరవేర్పు ఏ విధంగా ఉంది అన్నది కూడా సమాలోచనల్లో భాగంగానే ఉంది. ఏదేమయినప్పటికీ కరోనా లాంటి క్లిష్ట పరిస్థితులు దాటుకుని దేశాన్ని గాడిన పెట్టడం, ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇస్తూ చర్యలు తీసుకోవడం అన్నవి అనుకున్నంత సులువు కాదు.
ఈ నేపథ్యంలో విశాఖ కేంద్రంగా ఎప్పటి నుంచో ఆంధ్రులు డిమాండ్ చేస్తున్న ప్రత్యేక రైల్వే జోన్ కు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఏమయినా చెబుతారా.? గతంలో ఇచ్చిన హామీలకే పట్టింపు లేదు కనుక అన్ని హామీలలో భాగంగానే దీన్ని కూడా అటకెక్కిస్తారా అన్నది సందేహాలు చాలా నెలకొన్ని ఉన్నాయి. 2019లో ఇచ్చిన మాట ప్రకారం విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం ముందుకు వచ్చి తరువాత మాత్రం మాట మార్చినిశ్శబ్దం అయింది అని ప్రధాన మీడియా చెబుతోంది.
అప్పటి నుంచి ఇప్పటిదాకా రైల్వే జోన్ ఊసెత్తిన ప్రతిసారీ కేంద్రం కస్సు బుస్సులు ఆడుతుంటే తప్ప న్యాయం చేస్తున్న దాఖలాలు అయితే లేవు. వరుస బడ్జెట్లలో ఎక్కడా కూడా రైల్వే జోన్ ప్రస్తావన ఉన్నా ఆశించిన స్థాయిలో నిధుల కేటాయింపులు లేకుండా జాగ్రత్త పడ్డారు. రాష్ట్రం నుంచి ఒత్తిడి లేకపోవడం మరో విశేషం అని కూడా ప్రధాన మీడియా వాపోతోంది. ఈ నేపథ్యంలో కొత్త బడ్జెట్లో రైల్వే జోన్ కు సంబంధించి ఏమయినా ప్రకటన చేస్తారా అన్న ఉత్కంఠ ఉంది.
ఇప్పటికే పలుమార్లు ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువచ్చేందుకు శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు తనవంతు కృషి చేశారు. పార్లమెంట్ వేదికగా ఎన్నో సార్లు రైల్వే జోన్ కు ఉన్న ఆవశ్యకత గురించి వివరించారు. అయినా కూడా కేంద్రం మాత్రం అన్నీ వింటూ తరువాత చూద్దాం తరువాత చేద్దాం అన్న వైఖరిలో భాగంగానే ప్రవర్తిస్తోంది.