రాష్ట్రంలో నిరంకుశ పాలన జరుగుతోందని ఏపీ బిజెపి ఉపాధ్యక్షుడు విష్ణు కుమార్ రాజు అన్నారు. ఈ నిరంకుశ పాలనను అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరు మీద ఉందని ఆయన అన్నారు. జగన్ సర్కార్ కి మూడున్నర ఏళ్ల పాటు సమయం ఉందని, కానీ మూడున్నర ఏళ్ళు ఆయన పరిపాలిస్తారా? లేదా? అన్న అనుమానం మాకుందని అన్నారు. జగన్ ప్రభుత్వం మూడున్నరేళ్లు కొనసాగుతుందన్న గ్యారంటీ లేదన్నారు ఆయన.
అధికారంలో ఉన్నంత కాలం మంచిగా ఉండాలని జగన్ కి సలహా ఇస్తున్నామని ధర్మ పరిరక్షణ కోసం అంతర్వేది, అమలాపురం వెళ్లిన వారిపై అక్రమ కేసులు పెట్టారన్న ఆయన తక్షణమే వాటిని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే తమ నిరసనలు కంటిన్యూ గా జరుగుతూనే ఉంటాయని ఆయన హెచ్చరించారు. హిందువుల మనోభావాలను జగన్ ప్రభుత్వం దెబ్బతీస్తోందని, ప్రభుత్వ తీరుకు తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. దేవాలయ ఆస్తులు, భూములు కొల్లగొట్టాలని చూస్తే పరాభవం తప్పదని ఆయన అన్నారు. గృహనిర్భంధాలు చేసినంత మాత్రాన తమ పోరాటం ఆగదని ఆయన అన్నారు. ప్రశ్నిస్తే గొంతునొక్కే దోరణి ఆట్టేకాలం సాగదని ఆయన అన్నారు.