రాష్ట్రంలో ఉప ఎన్నికలకు అవకాశం ఉందా? అది కూడా పార్లమెంటు స్థాయిలో ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయా? అంటే.. తాజా పరిణామాల నేపథ్యంలో రెండు స్థానాలకు ఉప పోరు జరిగే ఛాన్స్ ఉందనే కథనాలు వస్తున్నాయి. ఒకటి తిరుపతి ఎంపీ దుర్గాప్రసాదరావు హఠాన్మరణం చెందిన నేపథ్యంలో తిరుపతిలో ఉప ఎన్నిక ఖాయమే. ఇక, మరో నియోజకవర్గంలోనూ ఉప ఎన్నిక వస్తుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అదే వైసీపీ ఎంపీ.. నరసాపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కనుమూరి రఘురామకృష్ణరాజు కనుక రాజీనామా చేస్తే.. ఆ స్థానానికి కూడాఉప పోరు జరిగే అవకాశం ఉంది.
అయితే, రఘురామ విషయం కొంత డోలాయమానంలో ఉన్నప్పటికీ.. త్వరలోనే దీనిపై నిర్ణయం వస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని ఢిల్లీ వర్గాల నుంచి కథనం. దీనికి రఘురామ వ్యాఖ్యలు బలం చేకూరుస్తున్నాయి. కొన్నాళ్లి కిందటి వరకు కూడా రఘురామ.. రాజీనామా చేసేది లేదన్నారు. కానీ, ఇటీవల కాలంలో ఆయన అమరావతిని రాజధాని అజెండాగా ప్రకటిస్తే.. తాను రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తానని చెప్పారు. ఈ క్రమంలోనే ఆయన ఇతర రాజకీయ పార్టీల మద్దతును కూడగడుతున్నారు.
రాజధాని అమరావతిని కొనసాగించాలని చంద్రబాబు నిర్ణయించుకున్న నేపథ్యంలో రఘురామ రాజీనామా చేస్తే.. ఆయనకు పరోక్షంగా మద్దతివ్వాలని బాబు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. తాజాగా రఘురామకు చంద్రబాబు ఫోన్ చేశారని సమాచారం. అంటే.. రఘు రామరాజు.. త్వరలోనే రాజీనామాపై ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. దీనిని బట్టి తిరుపతి ఉప ఎన్నికతో పాటు.. నరసాపురానికి కూడా ఒకే సారి జరిగే అవకాశం ఉంది. ఇది.. జగన్‌కు ఎలాంటి పరిణామాన్ని తీసుకువస్తుంది? అనేది కీలకంగా మారింది.
నరసాపురంలో రాజధాని కోణంలో ప్రచారం జరిగితే.. జగన్‌కు ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. దీనిపై వ్యూహ ప్రతివ్యూహాలు సాగుతున్నాయి. తమతో సఖ్యతగా ఉన్న జగన్‌కు బీజేపీ అంతో ఇంతో సహకరిస్తోంది. అయితే, రఘురామ ఆశలన్నీ.. బీజేపీపైనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయనకు టికెట్ ఇస్తుందా? ఇవ్వదా? అనేది చూడాలి తిరుపతిలో ఏకపక్షంగా మళ్లీ వైసీపీ గెలుపు గుర్రం ఎక్కే అవకాశం ఉంది.దుర్గా ప్రసాదరావు సెంటిమెంటు, వైసీపీ నేతల హవా కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దీనిపై జగన్‌కు ఎలాంటి ఇబ్బందీ లేదు. ఎటొచ్చీ నరసాపురమే ప్రతిష్టాత్మకం కానుందని అంటున్నారు.
-vuyyuru subhash