ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. గత వైసీపీ ప్రభుత్వంలో చాలా పొరపాట్లు జరిగాయని ఓ వైపు సీఎం చంద్రబాబు.. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో పేర్కొంటున్న విషయం తెలిసిందే. తాజాగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశానికి పలువురు ఉన్నతాధికారులు, ఇంజనీర్లు హాజరయ్యారు. స్వచ్ఛాంధ్రకు నిధుల లభ్యత, ఖర్చుల వివరాలపై డిప్యూటీ సీఎం ఆరా తీశారు. గత ఐదేళ్లలో కేంద్రం విడదల చేసిన రూ.1,066 కోట్లు ఏమయ్యాయని అధికారులను ప్రశ్నించారు. కేంద్ర నిధులను రాష్ట్ర ఆర్థిక శాఖ స్వచ్ఛాంధ్రకు విడుదల చేయలేదని అధికారులు తెలిపారు. పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా శాఖలపై గురువారం డిప్యూటీ సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. మరోవైపు ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీక్షలో ఉన్నారు. ఈ దీక్ష దాదాపు 18 రోజుల పాటు సాగనున్నట్టు సమాచారం. ఈ దీక్షలో కేవలం ద్రవ పదార్థాలు, పండ్ల మాత్రమే తీసుకోనున్నారు పవన్ కళ్యాణ్.