లోకేష్ దూకుడు ఎందుకు త‌గ్గింది…. టీడీపీలో ఏం జ‌రుగుతోంది…!

-

నారా లోకేష్‌. మాజీ మంత్రి, చంద్ర‌బాబు త‌న‌యుడిగా ఆయ‌న గుర్తింపు తెచ్చుకున్నారు. మ‌రో మాట‌లో చెప్పాలంటే.. చంద్ర‌బాబు త‌ర్వాత టీడీపీకి ఆయుప‌ట్టుగా ఆయ‌నే ఉంటార‌నే ప్ర‌చారం కూడా ఉంది. అలాంటి నాయ‌కుడు ఇటీవ‌ల ఆశించిన విధంగా దూకుడు ప్ర‌ద‌ర్శించ‌లేక‌పోతున్నారని పార్టీలోనే చ‌ర్చ న‌డుస్తుండ‌డం గ‌మ‌నార్హం. ముఖ్యంగా అమ‌రావ‌తి విష‌యంలో ఆదిలో చూపించిన దూకుడు ఇప్పుడు త‌గ్గించార‌ని అంటున్నారు. నిజానికి అమ‌రావ‌తి ఉద్య‌మం ఇప్ప‌టికి 240 రోజుల‌కు చేరుకుంటోంది. ఈ క్ర‌మంలో ఇప్ప‌టి వ‌ర‌కు రాజ‌ధాని పోరులో రైతుల‌కు మ‌ద్ద‌తు ఇచ్చేందుకు స్వ‌యంగా లోకేష్ వ‌చ్చింది నాలుగు సార్లు మాత్ర‌మే.


త‌ర్వాత ఆయ‌న ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు క‌నిపించ‌డం లేదు. ముఖ్యంగా జ‌గ‌న్ స‌ర్కారు ఇక్క‌డి భూముల్లో ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్ జ‌రిగింద‌ని ఆరోప‌ణ‌లు చేసిన నాటి నుంచి లోకేష్ క‌నిపించ‌డం మానేశారనేది వైఎస్సార్ సీపీ నేత‌ల విమ‌ర్శ‌. దీనిని టీడీపీ నేతలు కొన్నాళ్లు కొట్టిపారేసినా.. త‌ర్వాత దీనిని ప‌ట్టించుకోలేదు. ఇక‌, ఇప్పుడు మూడు రాజ‌ధానుల విష‌యం ప‌ట్టాలెక్కిన త‌ర్వాత పూర్తిగా లోకేష్ త‌న దూకుడును త‌గ్గించేశారు. ఎక్క‌డా అమ‌రావ‌తి గురించి పెద్ద‌గా మాట్లాడ‌డం లేదు. పైగా హైద‌రాబాద్ విడిచి ఆయ‌న రావ‌డం లేదు. మొన్నామ‌ధ్య మండ‌లిలో మంత్రి వెలంప‌ల్లి శ్రీనివాస‌రావుపై ఎమ్మెల్సీ ఒక‌రు చేయిచేసుకున్నార‌న్న ఘ‌ట‌న త‌ర్వాత లోకేష్ మరింత‌గా ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్నారు.

కేవ‌లం ట్విట్ట‌ర్‌లో ఒక‌టి రెండు ట్వీట్ల‌తో స‌రిపెడుతున్నారు. ఇక‌, ఇప్పుడు అమ‌రావ‌తి ఉద్య‌మం తాడోపేడో తేల్చుకునే స‌మ‌యం ఆస‌న్న‌మైంది. జ‌గ‌న్ దూకుడు పెంచారు. మూడు రాజ‌ధానుల‌పై బీజేపీని క‌ట్ట‌డి చేసేశారు. ఇక‌, సుప్రీం కోర్టులో హైకోర్టు విధించిన‌స్టే ఎత్తేస్తే.. త‌ర‌లింపు ప్ర‌క్రియ‌ను ఆఘ‌మేఘాల‌పై పూర్తి చేసేస్తారు. మ‌రి ఈ నేప‌థ్యంలో భావి టీడీపీ అధ్య‌క్షుడిగా త‌న‌ను తాను నిరూపించుకునేందుకు ఉన్న పెద్ద అవ‌కాశాన్ని లోకేష్ వినియోగించుకోలేక పోతున్నార‌నే వాద‌న సొంత పార్టీలోనే వినిపిస్తున్న‌ది. కానీ, లోకేష్ మాత్రం బ‌య‌ట‌కు రాకుండా ట్విట్ట‌ర్ రాజ‌కీయాల‌కు ప‌రిమిత‌మ‌వుతున్నారు. మ‌రి ఇలా అయితే, భ‌విష్య‌త్తు క‌ష్ట‌మ‌నే భావ‌న ఉంది. మ‌రి ఏంచేస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news