ఆ ఎమ్మెల్సీ ని సొంత పార్టీనేతలే సైడ్ చేశారా…!

అధినేత పిలిచి మరీ పదవిని కట్టబెట్టారు.కానీ సొంతపార్టీ నేతలే షాకిస్తున్నారు..విజయనగరం జిల్లా అధికారపార్టీలో ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పెన్మత్స సూర్యనారాయణరాజు. వైసీపీ ఎమ్మెల్సీ. విజయనగరంలో అంతా సురేష్‌బాబు అని పిలుచుకుంటారు. మాజీ మంత్రి పెన్మత్స సాంబశివరాజు కుమారుడిగానూ గుర్తింపు ఉంది. 2014లో నెల్లిమర్ల వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. అయినప్పటికీ జిల్లాలో తొలిసారిగా వైసీపీ జెండా మోసిన కుటుంబంగా పార్టీ అధిష్ఠానం గుర్తుపెట్టుకుంది.

2019లో టికెట్‌ ఇవ్వకపోయినా.. ఎమ్మెల్సీని చేస్తానని హామీ ఇచ్చారు అధినేత. ఆ ఆశ తీరకుండానే సాంబశివరాజు చనిపోయారు. తర్వాత రోజుల్లో సురేష్‌బాబును సీఎం జగన్‌ పిలిచి ఎమ్మెల్సీని చేశారు.ఇంతవరకు బాగానే ఉన్నా… సురేష్‌బాబు ఎమ్మెల్సీ అయిన తర్వాతే విజయనగరం జిల్లాలో అసలు కథ మొదలైంది. జిల్లాలోని కొందరు వైసీపీ నాయకులు సురేష్‌బాబును దూరం పెడుతున్నారట. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల సమాచారం ఇవ్వడం లేదట.

ఒకప్పుడు తమ కుటుంబం చక్రం తిప్పిన నెల్లిమర్లలోను ఆయనకు తగిన గౌరవం లభించడం లేదని చెబుతున్నారు. నెల్లిమర్ల ఎమ్మెల్యేగా మంత్రి బొత్స సత్యనారాయణ బంధువు బడ్డుకొండ అప్పలనాయుడు ఉన్నారు. ఒకవేళ నెల్లిమర్లలో ఎమ్మెల్సీకి ప్రాధాన్యం ఇస్తే ఎమ్మెల్యే కోప్పడతారని అనుకున్నారో లేక వారికేమైనా ఆదేశాలు వెళ్తున్నాయోకానీ సురేష్‌బాబును పట్టించుకోవడమే మానేశారట అధికారులు. జిల్లాకు ఎవరైనా మంత్రులు వచ్చినా.. పర్యటించినా ఎమ్మెల్సీ సురేష్‌బాబుకు చెప్పడం లేదని పెన్మత్స అభిమానుల్లో చర్చ జరుగుతోందట. సురేష్‌బాబు పదవీ కాలం 2023 మార్చి వరకు ఉంది.

ఒకవేళ ఆయనకు ప్రాధాన్యం ఇస్తే 2024 ఎన్నికల నాటికి ఎమ్మెల్యే అభ్యర్థిగా తెరపైకి వస్తారనే అనుమానాలు ఉన్నాయట వైసీపీలోని ప్రత్యర్థులకు. నెల్లిమర్లలో పాగా వేయాలని అనుకుంటున్న వారికి ఈ పరిణామాలు రుచించడం లేదని సమాచారం. అందుకే ప్రజలకు, అధికారులకు ఎమ్మెల్సీని దూరం చేస్తే తమ పని ఈజీగా వర్కవుట్‌ అవుతుందని ప్లాన్‌ వేశారట. ఈ పరిణామాలపై సురేష్‌బాబు కౌంటర్‌ అటాక్‌ మొదలు పెడితే మాత్రం రాజకీయం మరింత వేడెక్కడం ఖాయం.