జగన్ పై కోపం… రాష్ట్రంపై తీర్చుకోవద్దు!

-

పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేట‌రీ ద్వారా రాయ‌ల‌సీమ ప్రాంత ప్ర‌జ‌ల‌కు సాగునీరు, తాగునీరు అందించేందుకు ఏపీ స‌ర్కార్ జారీ చేసిన జీఓ 203పై రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజ‌కీయ జల వేడి ర‌గిలిన సంగతి తెలిసిందే! ఈ విషయంలో సరిగ్గా గమనిస్తే… తెలంగాణ రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం జెండాలు, అజెండాల‌ను ప‌క్క‌న పెట్టి… ప్రాంత ప్ర‌యోజ‌నాల కోసం అన్ని రాజ‌కీయ ప‌క్షాలు ఏక‌మ‌వుతున్నాయి. ఈ విషయంపై ఎవరి స్టైల్లో వారు ధర్నాలకు, దీక్షలకు దిగుతూ, పోరాటాలు చేసే పనికి పూనుకున్నారు. కానీ… ఏపీలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం.. ప్రజల గురించి ఆలోచించడం కేవలం జగన్ సర్కార్ బాధ్యతే! మిగిలిన పార్టీలు వారి వారి కంఫర్ట్ జోన్ ల మేరకు ఏ యే విషయాలపై స్పందించాలి, మరి ఏ యే విషయాలపై ఎంత మేర ప్రతిస్పందించాలి అనే విషయాలపై రాజకీయ ఆలోచనలు చేస్తూ ఉంటారు! ఇక్కడ మరో దురదృష్ట సంఘటన ఏమిటంటే… అక్కడ అంతా జిల్లా స్థాయిలోనే ఆలోచిస్తారు తప్ప… రాష్ట్ర స్థాయిలో ఆలోచించే నేతలు కరువవ్వడం! ఈ వ్యవహారంపై ప్రతిపక్ష పార్టీలు ఎవరెవరు ఎలా స్పందించారు అనేది ఇప్పుడు చూద్దాం!

జ‌గ‌న్ స‌ర్కార్‌కు అన్ని రాజ‌కీయ ప‌క్షాలు అండ‌గా నిల‌వాల‌ని బీజేపీ నుంచి బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. “పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేట‌రీ ద్వారా రాయ‌ల‌సీమ ప్రాంత ప్ర‌జ‌ల‌కు సాగునీరు, తాగునీరు అందించేందుకు సీఎం వైఎస్ జ‌గ‌న్‌ చేప‌ట్టిన చ‌ర్య‌ల‌ను రాష్ట్రంలోని ఇత‌ర పార్టీల‌న్నీ స‌మ‌ర్థించి మ‌ద్ద‌తు ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉంది” అని రాయలసీమ ప్రాంతానికి చెందిన విష్ణువ‌ర్ధ‌న్‌ రెడ్డి నుంచి ఒక ప్రకటన వచ్చింది. ఆయన సీమ ప్రాంత నేతగా ఈ మాట చెప్పారా లేక బాధ్యతగల ప్రతిపక్ష పార్టీ మనిషిగా చెప్పారా అనేది తర్వాత సంగతి! కానీ… బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయన మాత్రం ఆ స్థాయిలో స్పందించలేకపోయారు! అమ‌రావ‌తి స‌మ‌స్య‌కొస్తే మాత్రం దీక్ష‌ల‌కు, ధ‌ర్నాల‌కు కూర్చునే ఆయన… క‌ర‌వు ప్రాంత‌మైన సీమ కోసం సీఎం చేప‌ట్టిన ప‌థ‌కానికి మ‌ద్ద‌తు ప‌లికేందుకు మాత్రం ముందుకు రాలేకపోతున్నారు! అమరావతి అంటే… ఆయన సొంతజిల్లా అని భావన కాబోలు లేక బాబు కోరిక అనే ఆలోచన కాబోలు!

ఇప్పుడు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ విషయానికి వస్తే… చంద్ర‌బాబునాయుడు రోజూ జూమ్ వీడియా కాన్ఫ‌రెన్స్‌ లు పెట్టి గంట‌ల త‌ర‌బ‌డి ఉప‌న్యాసాలు ఇస్తుంటారు కానీ… ఈ వ్యవహారంపై మాత్రం నోరు మెదపడం లేదు! తాజాగా ఆయన అధ్య‌క్ష‌త‌న జరిగిన టీడీపీ స‌ర్వ‌స‌భ్య స‌మావేశంలో కూడా… బాబు… విశాఖ ఎల్జీ పాలిమ‌ర్స్ టాపిక్ పై చెప్పిందే చెప్పారు తప్ప… పోతిరెడ్డిపాడు జ‌ల వివాదంపై మాట మాత్రం కూడా స్పందించ‌లేదు! ఇక జనసేన పరిస్థితి కూడా అంతే… ఎన్నికల ముందు మాట్లాడితే రాయలసీమ పేరుచెప్పిన పవన్ కూడా ఈ విషయంపై స్పందించకపోవడం గమనార్హం. గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో రాయ‌ల‌సీమ‌లో 52 అసెంబ్లీ స్థానాల‌కు గాను టీడీపీకి కేవ‌లం మూడే స్థానాలు … పార్ల‌మెంట్ స్థానాల్లో 8కి సున్నా స్థానాలు టీడీపీ – జనసేనలకు రావడంతో సీమపై వీరు అక్కసు పెంచుకున్నారని అనుకోవాల్సిన పరిస్థితి! ఎందుకంటే… బాబు – పవన్ లు జాతీయస్థాయి నేతలవంటి వారు! ఇలాంటివారు కూడా రాయలసీమ వ్యవహారంపై ఇంత ముఖ్యమైన టాపిక్ పై స్పందించకపోతే ఎలా?

రాయ‌ల‌సీమ‌లో 5,125 గ్రామాలున్నాయి. ఇక్కడ 1.64 కోట్ల మంది నివ‌సిస్తున్నారు. కోట్లాది మందికి సాగు, తాగునీరు అందించేందుకు జ‌గ‌న్ స‌ర్కార్ జారీ చేసిన జీవోపై అటు వైపు తెలంగాణ స‌మాజం అంతా ఏక‌మై అడ్డుకునే య‌త్నాలు తీవ్ర‌త‌రం చేస్తుంటే… ఆంధ్ర‌ప్ర‌దేశ్ కూడా అదే స్ఫూర్తితో ముందుకు క‌ద‌లాల్సిన స‌మ‌యం ఇది అన్ని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు గుర్తించాల్సిన సమయమిది! ఇదే అమ‌రావ‌తి విష‌యానికి వ‌స్తే కేవ‌లం 19 గ్రామాల ప్ర‌జ‌ల కోసం టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ, సీపీఐ ఏ విధంగా ఆందోళ‌న‌లు చేస్తున్నాయో చూస్తూనే ఉన్న ఈ దశలో… ఈ శ్రద్ధ ఇంత ముఖ్యమైన విషయంపై ఎందుకు పెట్టడంలేదు!! అమరావతిలో పెట్టినన్ని పెట్టుబడులు సీమలో వీరు పెట్టలేదనా…? జనాలు ఎలా అర్ధం చేసుకోవాలి? ఇప్పటికైనా మించిపోయింది లేదు… ఇరు రాష్ట్రాల మద్య సఖ్యత పోకుండా ఈ వ్యవహారం పై ఏపీ నుంచి అన్ని పక్షాలు ఏకతాటిపైకి వచ్చి పోరాడాలని అంతా కోరుకుంటున్నారు!

Read more RELATED
Recommended to you

Latest news