జగన్‌కు ఆ టీడీపీ ఎమ్మెల్యే పెద్ద తలనొప్పిలా ఉన్నారే… !

-

అధికార వైసీపీ దాటికి రాష్ట్రంలో టీడీపీ నేతలు పూర్తిగా సైలెంట్ అయిపోతున్న విషయం తెలిసిందే. ఎక్కడ ఏం మాట్లాడితే ఏ కేసులు పెట్టి ఇబ్బంది పెడతారనే భయంతో బయటకొచ్చి గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీయలేకపోతున్నారు. కానీ కొందరు టీడీపీ నేతలు ఏ మాత్రం తగ్గకుండా జగన్ ప్రభుత్వం తప్పులని నిర్భయంగా ఎత్తి చూపుతున్నారు. నిత్యం ఏదొక విషయంలో ప్రభుత్వంపై పోరాటం చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వైసీపీ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిలా ఉన్నారని చెప్పొచ్చు.


మొన్న ఎన్నికల్లో రాష్ట్రంలో జగన్ వేవ్ ఉన్నా సరే, పాలకొల్లు నుంచి మంచి మెజారిటీతో నిమ్మల రెండోసారి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన నిమ్మల ప్రతిపక్షంలోనే ఉంటూ, ప్రజా సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తున్నారు. నిత్యం నియోజకవర్గంలో కలియతిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. సమస్యలు తెలుసుకోవడమే కాదు, వెంటనే వాటి పరిష్కారం కోసం అధికారుల వెంట తిరుగుతూనే ఉంటారు. ఒకవేళ అధికారులు పట్టించుకోపోతే వినూత్న రీతిలో నిరసన తెలుపుతూ, అధికారుల చేత పనిచేయించుకుంటారు.

ఇక రాష్ట్రంలో ఉండే సమస్యలపై కూడా నిమ్మల గట్టిగానే గళం విప్పుతున్నారు. అలాగే అసెంబ్లీలో సైతం చంద్రబాబుకు సపోర్ట్‌గా ఉంటూ అధికార పార్టీని సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నారు. ఇలా దూకుడుగా ఉండే నిమ్మలకు అధికార పార్టీ సైతం చెక్ పెట్టేందుకు అష్ట‌క‌ష్టాలు ప‌డుతోంది. తాజాగా జగన్ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా మొదటి విడత రుణమాఫీ డబ్బులు అందించిన విషయం తెలిసిందే. ఈ ఆసరా పథకానికి సంబంధించి పాలకొల్లులో ప్రభుత్వం డ్వాక్రా మహిళలతో ఓ సభ పెట్టింది.

ఆ సభకు అధికార పార్టీ నేతలతో పాటు నిమ్మల కూడా హాజరయ్యి, అసలు ఆసరా పథకంలో ఉన్న లోటుపాట్లు ఏంటో చెప్పరు. అసలు ఈ పథకానికి ఏ కార్పొరేషన్ ద్వారా ఎంత డబ్బు తరలించారనేది స్పష్టంగా వివరించారు. అలాగే జగన్ ప్రభుత్వం ఓ చేత్తో డబ్బులు ఇస్తూ, మరో చేత్తో లాగేసుకుంటుందనే విషయాన్ని చెప్పరు. నిమ్మల చెప్పిన దానికి డ్వాక్రా మహిళల నుంచి కూడా మంచి స్పందనే వచ్చింది. పైగా నిమ్మల నిజాలు చెబుతుంటే, వైసీపీ నేతలు తెల్లమోహం వేసుకుని కూర్చుని చూస్తూ ఉండిపోయారు. ఇక త‌న‌కు త‌ల‌నొప్పిగా మారిన నిమ్మ‌ల‌కు చెక్ పెట్టేందుకు పాల‌కొల్లులో జ‌గ‌న్ సొంత పార్టీ నేత‌ల‌కే అంతు ప‌ట్ట‌ని వ్యూహాలు ప‌న్నుతున్నారు. అలాగే నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌ కౌరు శ్రీనివాస్‌ను ఎంక‌రేజ్ చేస్తూ ప్ర‌త్యేకంగా దృష్టి సారించారు.

Read more RELATED
Recommended to you

Latest news