టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం తలరాత మారుతోంది. అభివృద్ధి వైపు వేగంగా దూసుకుపోతోంది. వాస్తవానికి రాష్ట్రంలో ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న వైఎస్సార్ సీపీ, టీడీపీ అధినేత ఇద్దరి వ్యూహాలు ఒక్కటే. చంద్రబాబు సొంత నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ జెండా ఎగరేయాలని జగన్ భావిస్తే.. జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల సహా ఆయన సొంత జిల్లా కడపలో సైకిల్ పరుగులు తీయించాలని చంద్రబాబు ఆశలు పెట్టుకున్నారు. గత ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ఈ దిశగానే అడుగులు పడ్డాయి.
కడపలో స్టీల్ ప్లాంట్‌కు చంద్రబాబు శంకుస్థాపన చేయడం వెనుక కూడా జగన్ జిల్లాలో సైకిల్ పరుగులు పెట్టించాలనే వ్యూహమే. ఇక, పులివెందులలో అప్పటి టీడీపీ నేతలుగా ఉన్నసీఎం రమేష్ వంటి వారితో అనేక కార్యక్రమాలు చేయించారు. అయితే, చంద్రబాబు ఆశలు ఏమయ్యాయో.. గత ఎన్నికల్లో స్పష్టంగా అందరికీ తెలిసింది. ఇక, జగన్ విషయానికి వస్తే.. ఆయనకు కూడా చంద్రబాబు నియోజకవర్గంలోను, ఆయన జిల్లాలోనూ వైఎస్సార్ సీపీని నిలబెట్టాలని, సైకిల్ పరుగులకు బ్రేకులు వేయాలని అనుకున్నారు.
ఈ క్రమంలోనే గత ఏడాది ఎన్నికల్లో జగన్.. వ్యూహాత్మకంగా పార్టీలో కీలకమైన వారికి టికెట్లు ఇచ్చారు. వీరంతా విజయం సాధించారు. ఇక, బాబు సొంత నియోజకవర్గం కుప్పం విషయానికి వస్తే.. అక్కడ కూడా జగన్ వ్యూహం ఫలించింది. అయితే, అనుకున్నది యథాతథంగా జరగకపోయినా.. బాబు మెజారిటీని మాత్రం తగ్గించగలిగారు. దీంతో వచ్చే మూడేళ్లలో కుప్పంలో తనదైన శైలిలో దూసుకువెళ్తే.. బాబుకు చెక్ పెట్టడం ఖాయమని నిర్ణయానికి వచ్చిన జగన్.. ఇప్పుడు కుప్పం అభివృద్ధికి పెద్దపీట వేశారు. జిల్లాలో మున్సిపాలిటీ గ్రేడింగ్ ఈ కుప్పం పంచాయితీకి ఇచ్చారు.
నిజానికి వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే కుప్పంను మున్సిపాలిటీగా చేసి.. నిధులు సమకూర్చి.. అభివృద్ధిని పరుగులు పెట్టించడం.. జగన్ వ్యూహాత్మక నిర్ణయంలో భాగం. ఈ పరిణామాలు టీడీపీ నేతలకు మింగుడు పడడంలేదు. అరే.. ఇన్నాళ్లుగా నేనే ఇక్కడ నుంచి గెలుస్తున్నా.. ఏనాడూ.. మునిసిపాలిటీ చేయాలని అనిపించలేదు. అని చంద్రబాబు మధన పడే స్థాయిలో జగన్ ఇక్కడ చక్రం తిప్పుతున్నారు. ఇక, ఇక్కడే పేదలకు కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు జగన్ సర్కారు ప్రయత్నిస్తోంది. ఈ పరిణామాలతో చంద్రబాబుకు జగన్ చెక్ పెట్టడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.