చంద్రబాబు ఢిల్లీ టూర్‌పై వైఎస్ షర్మిల చురకలు అంటించారు. అయిననూ పోయి రావలె హస్తినకు అన్నట్లుంది ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలు అని… ఎన్డీఏ కూటమిలో పెద్దన్న పాత్రగా, ఢిల్లీలో చక్రం తిప్పాల్సిన చంద్రబాబు ఢిల్లీ చుట్టూ ఎందుకు చక్కర్లు కొడుతున్నట్లు..? అంటూ ఆగ్రహించారు. ముక్కుపిండి విభజన సమస్యలపై పట్టు బట్టాల్సింది పోయి.. బీజేపీ పెద్దలకు జీ హుజూర్ అంటూ సలాంలు ఎందుకు కొడుతున్నట్లు ? సెటైర్లు పేల్చారు.
కేంద్రంలో, రాష్ట్రంలో కూటమి సర్కార్ ఏర్పడి నెల రోజులు దాటినా.. మోడీతో గానీ ,ఇతర మంత్రులతో గానీ ఒక్క హామీ మీద ఎందుకు ప్రకటన చేయించలేక పోయారు? అని నిలదీశారు. గెలిచిన రోజు నుంచి నాలుగు సార్లు ఢిల్లీ పర్యటనలు చేసినా రాష్ట్ర ప్రయోజనాలపై ఒక్క ప్రకటన అయినా వచ్చిందా..? అని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఉండదని కేంద్ర పెద్దలతో చెప్పించ గలిగారా ? పోలవరం ప్రాజెక్టుకు నిధులపై స్పష్టత ఇచ్చారా..? అని నిలదీశారు. రాజధాని నిర్మాణంపై కేంద్రం ఇచ్చే సహాయం ఏంటో చెప్పగలిగారా..? మరోసారి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజల మనోభావాలతో బీజేపీ ఆటలు అడుకుంటుందని చంద్రబాబు గుర్తిస్తే మంచిదని తెలిపారు.