జ‌గ‌న్ చెప్పినా ఈ వైసీపీ నేత‌లు లైట్ తీస్కొన్నారే… !

వ‌ద‌లమంటే పాముకు కోపం.. మింగ‌మంటే క‌ప్ప‌కు కోపం అన్న‌ట్టుగా త‌యారైంది అనంత‌పురం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌ల ప‌రిస్థితి. క‌రోనా నేప‌థ్యంలో నాయ‌కులు ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. అయితే, ఈ విష‌యం తెలిసిన సీఎం జ‌గ‌న్‌. అంద‌రూ బ‌య‌ట‌కు వ‌చ్చి ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండాల‌ని, వారిలో క‌రోనాపై భ‌యాన్ని పోగొట్టాల‌ని రెండు రోజుల కింద‌ట ఆదేశించార‌ట‌. అయితే, ఒక‌రిద్ద‌రు త‌ప్ప ఎవ‌రూ ముందుకు రాలేనిప‌రిస్థితి జిల్లాలో నెల‌కొంది. జిల్లాలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు నాలుగున్నర నెలలుగా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రజాప్రతినిధులు మాత్రం ఇవేమీ పట్టనట్టు వ్యవహరిస్తుండటం విమర్శలకు తావిస్తోంది.

కరోనా బారిన పడిన ప్రజలకు కొవిడ్‌ ఆస్పత్రుల్లో సరైన సౌకర్యాలు అందడం లేదు. డిశ్చార్జ్‌ అయిన వారి బాగోగులు పట్టించుకునే నాథుడే లేడు. రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలని సలహా ఇవ్వడమే తప్ప అది పెంచుకోవడానికి వారికి ఆర్థిక వెసులుబాటు ఉందా లేదా అనేది చూడటం లేదు. జిల్లాలో కరోనా వైరస్‌ ప్రవేశించినప్పటి నుంచి ప్రైవేట్‌ వైద్యులు వైద్యం దాదాపుగా మానేశారు. సాధారణ జబ్బులు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న బాధితులకు ప్రైవేట్‌ వైద్యం అందడం లేదు. సాధారణ రోజుల్లో చిన్న జ్వరం వస్తే ఆ పరీక్షలు ఈ పరీక్షలంటూ రూ. వేలకు వేలు ఫీజులు వసూలు చేసిన విషయం ప్రజాప్రతినిధులకు తెలిసిందే.

ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మానవత్వం చాటే విధంగా ప్రైవేట్‌ వైద్యులు వ్యవహరించాలని సూచించి, ఆదేశించే నేతే లేకపోవడం గమనార్హం. ఆయా నియోజకవర్గాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులు ప్రైవేట్‌ ఆస్పత్రులు, క్లినిక్‌ల యాజమాన్యాలతో సమావేశాలు ఏర్పాటు చేసి ఆ మేరకు సూచనలు చేసి ఉంటే ప్రజలకు ప్రైవేట్‌ వైద్యం అందేది. ఈ నేపథ్యంలో సాధారణ రోగులకు వైద్యం అందని ద్రాక్షగానే మారడంతో ప్రజల ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోతున్నాయి. అదిలించేవారు లేకపోవడంతో ప్రైవేట్‌ అంబులెన్స్‌ యజమానులు దోపిడీకి తెర తీశారు.

రోగులను బెంగళూరు, హైదరాబాద్‌లకు తరలించేందుకు రూ. 50 వేల నుంచి రూ. 70 వేల వరకూ డిమాండ్‌ చేస్తున్నారు. ఈ విష‌యాల‌న్నీ తెలిసిన జ‌గ‌న్ నాయ‌కుల‌ను ఆదేశించి రెండు రోజులైనా వారు ఎక్క‌డా బ‌య‌ట‌కు రాక‌పోవ‌డంతో ఇప్పుడు మ‌ళ్లీ జ‌గ‌న్ ఏం చేస్తారోన‌ని నాయ‌కులు త‌ల్ల‌డిల్లుతున్నార‌ట‌. పోనీ.. బ‌య‌టకు వ‌స్తే.. క‌రోనా ఎక్క‌డ అంటుకుంటుందోన‌ని అల్లాడిపోతున్నార‌ట‌. ఇదీ సంగ‌తి!!