ఆఫ్గనిస్థాన్‌లోని కాబూల్ ఎయిర్ పోర్టు ప్రాంతం మరోసారి బాంబు పేలుడుతో దద్దరిల్లింది. అమెరికా డ్రోన్ దాడికి ప్రతీకారంగా ISIS ఈ దాడి చేపట్టినట్లు తెలుస్తోంది. ఎయిర్‌పోర్టు సమీపంలో అమెరికా విమాన దళాలను లక్ష్యంగా చేసుకుని బాంబు దాడికి దిగినట్లు సమాచారం. కానీ బాంబు మాత్రం ఎయిర్ పోర్టు సమీపంలోని ఓ ఇంటిపై పడింది. దీంతో ఇద్దరు చనిపోగా ముగ్గురికి గాయాలయ్యాయి.
ఈ దాడి వెనుక ISIS ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. కాబూల్ ఎయిర్ పోర్టు లక్ష్యంగా దాడి చేయగా అక్కడికి సమీపంలో ఉన్న ఖాజె బాగ్రా ఏరియాలో ఓ ఇంటి మీద బాంబు పడింది. అక్కడి నుంచి ఎయిర్ పోర్టు సుమారుగా 800 మీటర్ల నుంచి 1 కిలోమీటర్ వరకు దూరం ఉంటుంది.
అయితే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇప్పటికే బాంబు దాడులపై హెచ్చరికలు చేశారు. కాబూల్ ఎయిర్ పోర్టు వద్ద ఉన్న అమెరికా పౌరులు వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని, అక్కడ మరో 24 నుంచి 36 గంటల్లో బాంబు దాడులు జరిగే అవకాశం ఉన్నట్లు ఇంటెలిజెన్స్ సమాచారం అందిందని అంతకు ముందే తెలిపారు. అయితే ఆయన చెప్పినట్లుగానే బాంబు దాడి జరగడం గమనార్హం.