ఏపీలో మరో భారీ అగ్నిప్రమాదం..కోట్ల ఆస్తి నష్టం

ఏపీలో మరో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కృష్ణా జిల్లా గన్నవరం మండలం వీరపనేని గూడెం లో అగ్ని ప్రమాదం జరిగింది.తెంపల్లి వద్ద టవల్స్‌ కంపెనీలో వేకువ జామున ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. పరిసర ప్రాంతాలన్నీ దట్టమైన పొగ తో నిండిపోయాయి. స్థానిక ప్రజలంతా ఏమవుతందో తెలియక భయపడిపోయారు. ప్రమాద విషయం గుర్తించిన స్థానికులు, కంపెనీ యజమానికి, పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచార మిచ్చారు.

హుటాహుటిన రంగం లోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది.. రెండు అగ్నిమాపక యంత్రాల తో మంటలార్పుతున్నారు. ప్రమాద సమయంలో కార్మికు లెవరూ లోపల లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఈ కంపెనీ లో ప్లాస్టిక్‌ బ్యాగులతో పాటు టవల్స్‌ ను తయారు చేస్తారు. అవన్నీ కాలి బూడిదైపోయాయి. దీంతో కోట్లల్లో ఆస్తి నష్టం జరిగిందని యజమాని చెబుతున్నాడు. ఇక ప్రమాదం పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం పోలీసులు ఈ అగ్ని ప్రమాదం పై దర్యాప్తు చేస్తున్నారు.