రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో రెండ్రోజుల కొకసారి భారీ వర్షం కురుస్తోంది. దీంతో నగరవాసులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ అప్పుడప్పుడు వర్షాలు కురుస్తున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి. అటు ఏపీలోని విజయవాడ, తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ నష్టం సంభవించింది.
అయితే, తెలుగు రాష్ట్రాల్లో మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడటంతో తెలుగు రాష్ట్రాల్లొ నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పుడిప్పుడే అల్పపీడనం బలపడుతుంటంతో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీచేశారు.