ఇటీవలి కాలంలో ఆన్లైన్ మోసాలు పెరిగిపోయాయి. బ్యాంకులు, పోలీసులు ఎంత హెచ్చరిస్తున్నా కొందరు మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎంత చదువు చదివినా మోసగాళ్లు ప్లే చేసే ట్రిక్కులకు పడిపోతున్నారు. దీంతో భారీ ఎత్తున డబ్బులను నష్టపోతున్నారు. తాజాగా పూణెలో మరొక ఆన్లైన్ మోసం వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ గిఫ్ట్‌కు ఆశపడి రూ.లక్షలు పోగొట్టుకుంది.
పూణెకు చెందిన ఓ ఐటీ ఉద్యోగిని (29)కి తాజాగా కొందరు సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు. ఖరీదైన గిఫ్ట్ పంపిస్తామని చెప్పారు. నిజమే అని ఆమె నమ్మింది. అయితే ఆ గిఫ్ట్‌ను ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ వారు సీజ్ చేశారని, అందుకు గాను కొంత ఫీజు కట్టాల్సి ఉంటుందని నమ్మబలికారు. దీంతో ఆమె నిజమే అని నమ్మి వారికి విడతలవారిగా మొత్తం రూ.26 లక్షలను పలు బ్యాంక్ అకౌంట్లకు ఆన్లైన్ లో ట్రాన్స్ఫర్ చేసింది.
అయితే ఆ మహిళ ఇటీవలే రెండు బ్యాంకుల నుంచి వేర్వేరుగా భారీ మొత్తాలలో పర్సనల్ లోన్ తీసుకుంది. ఆ మొత్తాన్ని సదరు నేరగాళ్లకు వారి అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసింది. అది కూడా సరిపోకపోవడంతో ఆమె తన మామ నుంచి రూ.3 లక్షలు, ఇతర బంధువులు, స్నేహితుల నుంచి మరికొంత మొత్తాన్ని కూడా అప్పు తీసుకుంది. మొత్తం కలిపి రూ.26 లక్షలను వారికి ట్రాన్స్ఫర్ చేసింది. అయితే అది కూడా సరిపోకపోవడంతో ఇంకొంత మొత్తాన్ని ముంబైలో ఉన్న మరొక బంధువుని అడిగింది. కానీ ఆ వ్యక్తి అది మోసమని పసిగట్టడంతో ఆమె వాస్తవాన్ని గ్రహించింది. తాను మోసపోయానని తెలుసుకుని వెంటనే హింజెవాడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.