ఎన్నికల్లో ఓటమి చినబాబులో మార్పు తీసుకొచ్చిందా

-

టీడీపీలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారారు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌. ఏపీలో సమస్య ఎక్కడుంటే అక్కడకు ఆయన వెళ్తుండటమే దీనికి కారణం. వరదలు.. ఏలూరు బాధితులు.. టీడీపీ నేతల అరెస్ట్‌ ఇలా విషయం ఏదైనా పర్యటించడానికి క్షణం ఆలస్యం చేయడం లేదు లోకేష్‌. నేతలు, కార్యకర్తలతో మమేకం అయిపోతున్నారు. అందరినీ కుశల ప్రశ్నలు వేస్తున్నారు. సిక్కోలు నుంచి చిత్తూరు, అనంతపురం వరకు ఇలా జిల్లాను చుట్టేస్తున్నారు చినబాబు. లోకేష్‌లో వచ్చిన ఈ మార్పు.. పర్యటనలే ఇప్పుడు టీడీపీలోనూ రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి.

గతంలో అధికారంలో ఉన్నప్పుడు పార్టీ ఆఫీస్‌, సమావేశాలు, అధికారిక పర్యటనలకే లోకేష్‌ పరిమితం అయ్యేవారనేది టీడీపీలో వినిపించే టాక్‌. అలాంటిది టీడీపీ విపక్షంలోకి వచ్చాక కొన్నాళ్లు మౌనంగా ఉన్న ఆయన.. ఇప్పుడు కాళ్లకు చక్రాలు కట్టుకున్నట్టు పర్యటనలు చేస్తున్నారు. ఈఎస్ఐ స్కామ్‌లో అచ్చెన్నాయుడిని అరెస్ట్‌ చేసిన సమయంలో శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ వెళ్లి అచ్చెన్న కుటుంబసభ్యులను పరామర్శించారు. ఆ తర్వాత వివిధ కేసుల్లో జేసీ ప్రభార్‌రెడ్డిని అరెస్ట్‌ చేయడంతో తాడిపత్రి వెళ్లి జేసీ ఫ్యామిలీతో మాట్లాడారు. అచ్చెన్న, జేసీలు ఇద్దరూ పార్టీలో పెద్ద నేతలు కాబట్టి లోకేష్‌ వెళ్లారని అనుకున్నా.. ఈ మధ్య ఆయన చేస్తున్న టూర్‌లు మాత్రం అందరినీ ఆలోచనలో పడేస్తున్నాయట.

భారీ వర్షాలు, వరదలకు దెబ్బతిన్న ఉభయ గోదావరి, కృష్ణా గుంటూరు జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో నారా లోకేష్‌ పర్యటించారు. జిల్లాల మీదుగా కారులో వెళ్తున్న సమయంలో టీడీపీ నేతలు ఆపిన ప్రతిచోట ఆగి వారిని పేరు పేరున పలకరించారు. కొల్లేరు ప్రాంతంలో టాక్టర్‌ నడిపారు. ఆ ట్రాక్టర్‌ కాస్తా అదుపుతప్పడంతో అధికార పార్టీకి టార్గెట్‌ అయ్యారు. ఇటీవల ఏలూరులో అంతుచిక్కని వ్యాధితో ప్రజలు వందల్లో ఆస్పత్రిలో చేరడంతో క్షణం ఆగలేదు. ఏలూరు వెళ్లిపోయారు లోకేష్‌. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు.

పర్యటన ఏదైనా.. సమస్య తీవ్రతను బట్టి రాజకీయ విమర్శలు కూడా చేస్తున్నారు నారా లోకేష్‌. ఇది పార్టీ నేతలకు కూడా హుషారు తీసుకొస్తోంది. కొందరైతే ఈ లోకేష్‌.. ఆ లోకేష్‌ వేరుగా ఉన్నారే అని అనుకుంటున్నారట. ఓటమి మార్పు తీసుకొచ్చిందో ఏమో టీడీపీకి కార్యకర్తలే బలం.. జనమే అండ అన్నట్టుగా చినబాబు పర్యటనలు ఉంటున్నట్టు చెవులు కొరుక్కుంటున్నారట. అదీకాకుండా చినబాబు ఏలూరు పర్యటన తర్వాత టీడీపీలోనూ ఆసక్తికర చర్చ మొదలైందట.

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కొంత రిజర్డ్వ్‌గా ఉండటం.. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలే గెలిపిస్తాయని భావించేవారని చెబుతారు. ఆ వైఖరి వల్లే 2019 ఎన్నికలు ఊహించని షాక్‌ ఇచ్చాయని తెలుగు తమ్ముళ్లు తరచు చెవులు కొరుక్కుంటారు. ఈ చురుకుదనమేదో అప్పుడే ఉండి ఉంటే.. ఇంత జరిగేదా? అని కామెంట్స్‌ చేస్తున్నారట. చేతలు కాలాక ఆకులు పట్టుకుంటున్నాం అని అనుకుంటున్నారట కార్యకర్తలు. మరి.. వచ్చే ఎన్నికల నాటి వరకు ఇలాంటి వైఖరితోనే ఉంటారో.. మధ్యలో మళ్లీ యూ టర్న్‌ తీసుకుంటారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news