మహారాష్ట్ర రాజకీయాల్లో మరో మలుపు చోటు చేసుకుంది. అధికార ప్రభుత్వం మారడంతో రాజకీయాలు వేడెక్కాయి. తాజాగా నేషనల్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సీపీ) అధినేత శరద్ పవార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్‌సీపీలోని అన్ని విభాగాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఎన్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రఫుట్ పటేల్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘నేషనల్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు శరద్ పవార్ ఆదేశాల మేరకు పార్టీలోని అన్ని విభాగాలను రద్దు చేయడం జరిగింది.’ అని ఆయన అన్నారు.
అయితే నేషనలిస్ట్ యువ కాంగ్రెస్, నేషనలిస్ట్ మహిళా కాంగ్రెస్, నేషనలిస్ట్ విద్యార్థి కాంగ్రెస్ విభాగాలను రద్దు చేయలేదని ప్రఫుల్ పటేల్ తెలిపారు. మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) కూటమి ప్రభుత్వం కూలిపోయిన కొద్ది రోజులకే ఈ నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. అయితే పార్టీలో కీలక విభాగాలను రద్దు చేయడం వెనకాల ఉన్న కారణాన్ని వెల్లడించలేదు. కాగా, గతంలో శివసేన నేతృత్వంలో ఎన్‌సీపీ కీలక పాత్ర పోషించింది.