ఓటీటీ కంటెంట్‌పై కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఘాటుగా స్పందించారు. ఓటీటీల్లో వచ్చే కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్‌లు అసభ్యకరంగా ఉంటున్నాయని మండిపడ్డారు. ఓటీటీకి ఇచ్చిన స్వేచ్ఛ క్రియేటివిటీ కోసమని.. అశ్లీలత, అసభ్య పదజాలం వాడేందుకు కాదని స్పష్టం చేశారు. హద్దులు దాటితే ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు.
‘కేవలం సృజనాత్మకత కోసమే డిజిటల్ వేదికలకు స్వేచ్ఛ ఇచ్చారు. అశ్లీలత, అసభ్యకరపదజాలం వాడేందుకు కాదు. అటువంటి వాటికి పాల్పడితే సహించేది లేదు. ఓటీటీ వేదికలపై అసభ్యకరమైన పదజాలం, అశ్లీల కంటెంట్‌పై ఫిర్యాదులు రావడంపై ప్రభుత్వం సీరియస్‌గానే ఉంది. ఇందులో మార్పులు తీసుకురావడానికి నిబంధనల్లో ఏమైనా మార్పులు అవసరమవుతాయా అనే కోణాన్ని ఐటీశాఖ పరిశీలిస్తుంది’ అని సమాచార, ప్రసారశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు.
ఇటీవల ఓటీటీలో విడుదలైన కాలేజీ రొమాన్స్ అనే వెబ్ సిరీస్‌కు సంబంధించిన కేసు విచారణ సమయంలో దిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇందులో అసభ్యకరమైన భాష ఉందని, అటువంటి వాటిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం సూచించింది.