ఆర్టికల్ 370, 35ఎ లను రద్దు చేయడం, జమ్మూకాశ్మీర్‌ను విభజించడం వల్ల ఇప్పుడు రెండు తెలుగు రాష్ర్టాల్లోని నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
జమ్మూ కాశ్మీర్‌లో గత కొద్ది రోజులుగా నెలకొన్న పరిణామాలకు చెక్ పెడుతూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. అందులో భాగంగానే ఆర్టికల్ 370, 35ఎ లను రద్దు చేయడంతోపాటు జమ్మూకాశ్మీర్ విభజన బిల్లును కూడా రాజ్యసభలో ప్రవేశపెట్టి ఆమోదింపజేశారు. అయితే ఈ విషయంపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు మిన్నంటుతుండగా.. రెండు తెలుగు రాష్ర్టాల్లో ఉన్న రాజకీయ పార్టీలు, నేతలు మాత్రం అంతకన్నా ఎక్కువగానే సంబర పడుతూ పండగ చేసుకుంటున్నారు.
ఆర్టికల్ 370, 35ఎ లను రద్దు చేయడం, జమ్మూకాశ్మీర్‌ను విభజించడం వల్ల ఇప్పుడు రెండు తెలుగు రాష్ర్టాల్లోని నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే.. జమ్మూకాశ్మీర్ విభజన బిల్లులో ఆ రాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన అంశం కూడా ఉంది. ఈ క్రమంలోనే ఆ రాష్ట్రంలో అసెంబ్లీ సీట్లను పెంచేందుకు కేంద్రం ఓ కమిషన్‌ను కూడా ఏర్పాటు చేయనుంది. అయితే ఇప్పటికే ఏపీ, తెలంగాణలలో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపుదల అంశం పెండింగ్‌లో ఉన్నందున సదరు కమిషన్ ఈ విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటుందని తెలుస్తోంది. దీంతో జమ్మూకాశ్మీర్‌తోపాటు ఏపీ, తెలంగాణలలోనూ అసెంబ్లీ సీట్లను పెంచుతారని ప్రచారం జరుగుతోంది.
నిజానికి 2014లో సమైక్యాంధ్ర విడిపోయాక ఏర్పడే రెండు తెలుగు రాష్ర్టాలలోనూ అసెంబ్లీ సీట్లను పెంచాలని ఏపీ పునర్విభజన చట్టంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం హామీనిచ్చింది. అయితే ఆ తరువాత అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ సర్కారు ఈ విషయంపై నాన్చుడు ధోరణిని ప్రదర్శిస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు జమ్మూకాశ్మీర్‌ను విభజించి అక్కడ అసెంబ్లీ సీట్లను పెంచుతుండడంతో.. ఇప్పుడు ఏపీ, తెలంగాణలపై కూడా దృష్టి పడింది. దీంతో రెండు తెలుగు రాష్ర్టాల్లోనూ త్వరలోనే అసెంబ్లీ సీట్లను పెంచుతారని తెలుస్తోంది. మరి ఈ విషయంలో ముందు ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూస్తే తెలుస్తుంది..!