ఉపఎన్నికల్లో ఏపీ బీజేపీని సొంత పార్టీ నేతలే ఇబ్బంది పెడుతున్నారా !

తిరుపతి ఉప ఎన్నికల్లో లేని బలాన్ని కూడదీసుకుని ఎన్నికల బరిలో దిగిన బీజేపీని ఒకే ఒక్క మాట ఇరకాటంలో పడేసింది. పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విడుదల చేసిన మ్యానిఫెస్టోలో స్పెషల్‌ స్టేటస్‌ ఇస్తామన్న అంశం ఉండటం బీజేపీకి ప్రాణ సంకటంగా మారింది. ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఉప ఎన్నిక అని తెలిసి కూడా ఆర్దిక మంత్రి బీజేపీసీనియర్ నేత నిర్మాల సీతారామన్ చేసిన ప్రకటన ఇప్పుడు ఏపీలో బీజేపీకి ప్రతికూలంగా మారింది. ఇకే టీడీపీ,వైసీపీ అదును చూసుకుని ప్రత్యేక హోదా పేరు చెప్పి ఉతికి ఆరేస్తున్నాయి.

పుదుచ్చేరిలో బీజేపీ మ్యానిఫెస్టో విడుదల చేస్తే అందులోని అంశాల ప్రకంపనలు తిరుపతిలో కనిపిస్తున్నాయి. ప్రత్యేక హోదా. రాష్ట్ర విభజన సమయంలో అదో బ్రహ్మాస్త్రం..తర్వాతి కాలంలో అదో బ్రహ్మపదార్థం. మోడీ సర్కార్‌ ఏపీకే కాదు ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా లేదంది. స్పెషల్‌ ప్యాకేజీకి ఒప్పించింది. కానీ మారిన రాజకీయ పరిస్థితులు ఏపీలో బీజేపీకి ప్రతికూలంగా మారాయి.స్పెషల్‌ స్టేటస్‌ ప్రజలకు సెంటిమెంట్‌గా మారిందన్న విషయం గ్రహించిన బీజేపీయేతర పార్టీలు సమయం చిక్కినప్పుడల్లా ఆ సమస్యకు ఊపిరి పోస్తున్నాయి. అలా బయటకొచ్చినప్పుడల్లా ఏపీ బీజేపీ నేతల ముఖాల్లో అప్పటి వరకు ఉన్న సంతోషం ఆవిరవుతోంది.

కేంద్రం ఏ పరిస్థితుల్లో ఏపీకి హోదా ఇవ్వలేదు.. ప్యాకేజీ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో వెల్లడించినా అవి జనాల్లోకి పెద్దగా వెళ్లడం లేదు. 2014 ఎన్నికల్లో ప్రత్యేక హోదా ఏ విధంగా బీజేపీకి అక్కరకు వచ్చిందో అదే అంశం 2019 ఎన్నికల్లో మరణశాసనంగా మారింది. ప్రస్తుతం తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల్లోనూ మొదట్లో హోదా ప్రస్తావన వచ్చింది. పార్టీలేవీ పెద్దగా పట్టించుకోలేదు. కానీ పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విడుదల చేసిన మ్యానిఫెస్టోలో స్పెషల్‌ స్టేటస్‌ ఇస్తామన్న అంశం ఉండటంతో అక్కడికన్నా.. ఆ వేడి సెగలు తిరుపతిలో రాజుకున్నాయి. మరోసారి వైరి పక్షాలకు బీజేపీ టార్గెట్‌ అయింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆ మ్యానిఫెస్టో విడుదల చేయడంతో పార్టీలు అలర్ట్‌ అయ్యాయి.

బీజేపీతోపాటు జనసేనకు కూడా ఇదే హోదా వివాదం పచ్చివెలక్కాయలా అడ్డుపడుతోంది. ప్రత్యేక ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలతో పోల్చిన పవన్‌ కల్యాణ్‌ మనసు మార్చుకుని మళ్లీ దోస్తీ చేశారు. ఆయన సాయంతో తిరుపతిలో నెట్టుకొద్దామని బీజేపీ చూస్తోంది. రకరకాల అస్త్రాలు బయటకు తీసింది. కానీ.. పుదుచ్చేరి బీజేపీ మ్యానిఫెస్టో తిరుపతిలోని రాజకీయ వాతావరణాన్ని మార్చేసింది. పరిస్థితిని గమనించిన కమలనాథులు.. అసలు మ్యానిఫెస్టోలో ఆ అంశమే లేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. చేతిలో మేనిఫెస్టో పేపర్లు పెట్టుకున్న వైరి పక్షాలు సాఫ్ట్‌ కార్నర్‌ ప్రదర్శించిన పార్టీలు సైతం విమర్శలకు పదునుపెట్టాయి.