రేపు చలో అమలాపురం కు బయలుదేరిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజుని తాడేపల్లిలోని ఆయన నివాసంలోనే విజయవాడ పోలీసులు నిర్బంధించారు. ప్రస్తుతం అమలాపురం పార్లమెంట్ పరిధిలో సెక్షన్ 30,144 అమల్లో ఉన్నందున ముందస్తు నిర్బంధం చేశామని చెబుతున్నారు పోలీసులు. అంతర్వేది రథం దగ్ధం ఘటనకు నిరసనగా ఛలో అమలాపురానికి బీజేపీ పిలుపునిచ్చింది. ఇక అంతర్వేది రధం దగ్ధం కేసును సిబిఐకి అప్పగించామని ఏలూరు రేంజ్ డీఐజీ ఎ మోహనరావు పేర్కొన్నారు.
సాంకేతికంగా సేకరించిన సాక్ష్యాధారాలు సీబీఐకి అప్పగిస్తామని, ఇప్పటికే ప్రభుత్వ కొత్త రధం తయారి కి నిధులు విడుదల చేసిందని అన్నారు. సోషల్ మీడియాలో కొన్ని పార్టీలు ఛలో అమలాపురం అంటు పిలుపునిస్తున్నాయని, కోవిడ్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 30 అమలులో ఉన్న నేపధ్యంలో ఆ కార్యక్రమానికి అనుమతి లేదని అన్నారు. అరాచక శక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామన్న ఆయన ఈ కేసులో అనుమానితులని విచారిస్తున్నామని అన్నారు.