రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన సామాజిక వర్గం కమ్మలు. ఆ పార్టీ, ఈ పార్టీ అనే తేడాలేకుండా అన్ని పార్టీలకూ వీరి మద్దతు చాలా అవసరం. ఆర్థికంగా, రాజకీయంగా కూడా వీరు ప్రధాన భూమిక పోషిస్తున్నారు. అందుకే ఏ నాయకుడైనా కూడా వీరిని మచ్చిక చేసుకునేందుకు, ఏ పార్టీ అయినా.. వీరికి తగిన విధంగా ప్రాధాన్యం ఇచ్చేందుకు ముందుకు వస్తాయి. అయితే, ఇంతటి ప్రాధాన్యం ఉన్న కమ్మల విషయంలో రాష్ట్ర బీజేపీ తప్పటగులు వేస్తోందా ? ఆ సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదా ? అంటే.. తాజాగా రాష్ట్ర బీజేపీ చీఫ్ ఏర్పాటు చేసుకున్న తన సైన్యం చూశాక కమ్మలకు ప్రాధాన్యం దక్కడం లేదనే అంటున్నారు పరిశీలకులు.
రాష్ట్రంలో బీజేపీకి పునాదులు వేసిన వారిలో కీలకమైన నాయకుడు, ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఈయ నకమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకుడే. అదేవిధంగా గతంలో మంత్రిగా చేసిన కామినేని శ్రీనివాసరావు, మాజీ ఎంపీ, ఒకప్పటి రాష్ట్ర బీజేపీ సారథి కంభంపాటి హరిబాబు వంటి వారు కూడా ఇదే సామాజిక వర్గానికి చెందిన వారే. దీంతో అప్పట్లో బీజేపీకి మంచి ప్రభావం వచ్చింది. పైగా ఎన్నికల సమయంలో పొత్తుల విషయంలోనూ కమ్మ నాయకులే ముందుండి పార్టీని నడిపించారు. కేంద్రంలోని బీజేపీ నాయకులతోనూ సమన్వయం చేసుకుని పార్టీని ముందుకు తీసుకువెళ్లారు. అయితే, ఇప్పుడు ఇదే సామాజిక వర్గానికి చెందిన నాయకులకు ప్రాధాన్యం తగ్గుతోందనే భావన వ్యక్తమవుతోంది.
ఒకరిద్దరు కమ్మలకు సోము ప్రాధాన్యం ఇచ్చినప్పటికీ.. కీలకమైన పురందేశ్వరి, కామినేని శ్రీనివాస్, కంభంపాటి హరిబాబు వంటి నాయకులను పక్కన పెట్టారు. వారికి రాష్ట్ర కమిటీలో ఎక్కడా చోటు పెట్లలేదు. పోనీ.. కేంద్రంలో ఏదైనా పదవులు వీరికి లభించే అవకాశం ఉందా? అంటి అది ఇప్పట్లో కనిపించడం లేదు. అయినప్పటికీ.. సోము వీరికి అవకాశం ఇవ్వకపోవడం వెనుక ఉన్న కీలకమైన కారణమేంటి? అనేది చర్చకు వస్తోంది.
అయితే, రాజకీయంగా కమ్మలు అంటే.. కేవలం టీడీపీకి అనుకూలంగా ఉంటారనే ఒకే ఒక్క కారణంగా వీరిని పక్కన పెట్టారా? అంటే.. కంభంపాటి వంటివారు కొన్నేళ్లుగా పార్టీలోనే ఉన్నారు. అలాంటప్పుడు ఆ సందేహానికి ఆస్కారం లేదు. ఏదేమైనా.. కమ్మలకు ప్రాధాన్యం లేకుండా చేసుకోవడం అంటే బీజేపీ ఏదో స్ట్రాటజీతోనే ఉందని అంటున్నారు. ఇక బీజేపీ జాతీయ నాయకత్వం సైతం కాపు వర్గాన్ని ఆకర్షించే వ్యూహంతో రాజకీయం చేస్తోంది. అందుకే కన్నా లక్షీనారాయణ, సోము వీర్రాజు లాంటి నేతలకే పార్టీ పగ్గాలు ఇస్తోంది. మరి ఈ నయా స్ట్రాటజీ ఏపీలో బీజేపీకి ఎంత వరకు ప్లస్ అవుతుందో ? చూడాలి.
-vuyyuru subhash