మేం తిట్టినా జగన్ పట్టించుకోరా ?

-

తెలంగాణలో ఏ విధంగా అయితే బలం పెంచుకు ని అధికారం సాధించే దిశగా అడుగులు వేస్తున్నామో, అదేవిధంగా ఏపీలోనూ ముందుకు వెళ్లాలనే దిశగా బిజెపి అడుగులు వేస్తోంది. తెలంగాణతో పోలిస్తే ఏపీలో బీజేపీ బలం తక్కువగా ఉండడంతో, జనసేన తో కలిసి ముందుకు వెళుతోంది. ఇటీవల దుబ్బాక, గ్రేటర్ ఎన్నికలలో వచ్చిన ఊపుతో బిజెపి ఏపీలోని తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలలో విజయం సాధించి, తమ పార్టీకి ఏపీలోనూ పట్టు ఉంది అని నిరూపించుకునేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి, ఆ పార్టీకి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మద్దతు పలుకుతూ వచ్చినా, బిజెపి ఒక్కసారిగా ఆ పార్టీని రాజకీయ శత్రువుల చూస్తూ.. ఇప్పుడు విమర్శలు చేస్తోంది. వైసీపీ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూ జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా బిజెపి ఏపీ నాయకులు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఈ రకమైన స్టేట్మెంట్లు ఇవ్వడం ద్వారా , తప్పనిసరిగా వైసిపి నాయకులు రియాక్ట్ అవుతారు అని, ప్రతి విమర్శలు చేస్తారని , ఆ విధంగా బిజెపి మరింత దూకుడు పెంచి ప్రజల లో బిజెపి బలం పెరిగే విధంగా చేసుకోవాలనే వ్యూహానికి తెరతీసింది.

కానీ బిజెపి నాయకులు ఊహించిన విధంగా ఇక్కడ పరిస్థితి కనిపించడం లేదు. ఎంత ఘాటు విమర్శలు చేసినా, వైసీపీ నాయకులు ఎవరు స్పందించడం లేదు. అసలు బిజెపి వ్యాఖ్యలను పట్టించుకోనట్టు వ్యవహరిస్తున్నారు. తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం పై ఇదే స్థాయిలో విమర్శలు చేయడం, దానికి ఆ పార్టీ నాయకులు రియాక్ట్ అవ్వడం, టిఆర్ఎస్ పై బిజెపి పెద్ద ఎత్తున విమర్శలు చేయడం వంటి వ్యవహారాలతో బీజేపీపై తెలంగాణ ప్రజల లో చర్చ జరిగింది. ముఖ్యంగా తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ టిఆర్ఎస్ ను రెచ్చగొట్టే విషయంలో సక్సెస్ అయ్యారు. అనుకున్న మేరకు తెలంగాణలో విజయం సాధించగలిగారు. ఇంకా అదే ఫార్ములాను ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వైసీపీ మీద ఉపయోగించి సక్సెస్ అవ్వాలని చూస్తున్నా, వైసీపీ నుంచి రియాక్షన్ రావడం లేదు. టిడిపిపై విమర్శలు చేస్తున్నా నాయకులు పెద్దగా స్పందించకపోవడంతో, తమ ప్లాన్ వర్క్ అవుట్ అవ్వడం లేదు అనే బాధ బిజెపి నాయకులలో కనిపిస్తోంది.

గత ప్రభుత్వాలు 60 ఏళ్ల లో లక్ష కోట్లు అప్పు చూపిస్తే వైసీపీ ప్రభుత్వం మొదటి ఆరు నెలల్లో 55 వేల కోట్ల అప్పులు చేసింది. అక్రమ, అనైతిక విధానాలను ప్రోత్సహించడంతో రాష్ట్ర అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. పారిశ్రామికవేత్తలు పారిపోయే విధంగా ఏపీ ప్రభుత్వం చేస్తోందని, కేంద్రం నిధులు ఇచ్చి సహాయం చేస్తుంటే, జగన్ తన పేరు పెట్టుకుని మాయ చేస్తున్నాడని, ఇళ్ల స్థలాల కోసం భూ సేకరణకు ఖర్చు చేసిన ఏడు వేల కోట్ల లో మూడు వేల కోట్లు అవినీతి జరిగింది అంటూ సోము వీర్రాజు ఘాటుగా విమర్శలు చేసినా, వైసీపీ నుంచి కనీస స్పందన కనిపించలేదు. దీనికి కారణం బిజెపి వ్యూహం వైసీపీ ముందుగానే గ్రహించడంతో, పార్టీ నేతలకు బీజేపీ విషయం లో స్పందించ వద్దనే మౌఖిక ఆదేశాలు వెళ్లడమే కారణంగా తెలుస్తోంది. ఏది ఏమైనా జగన్ రాజకీయ ఎత్తుగడల ముందు బిజెపి ప్లాన్ వర్కౌట్ అయ్యేలా కనిపించకపోవడం తో బిజెపి నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు గా కనిపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news