ఏపీకి మూడు రాజధానులు ఉండొచ్చు. విశాఖ పరిపాలనా రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా, అమరావతి శాసన రాజధానిగా మారొచ్చు అని గత నెల 17వ తేదీన ముఖ్యమంత్రి జగన్ చెప్పిన మాటను శాసనం గా మార్చేందుకు రంగం సిద్ధమైంది. ఇక కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. సీఆర్డీఏ చట్టం రద్దు, జోనల్ అభివృద్ధి కౌన్సిల్ బిల్లులను కేబినెట్ ఆమోదించనుంది. తర్వాత 10 గంటలకు బీఏసీ సమావేశం కానుంది. ఆ తర్వాత 11గంటలకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. సీఆర్డీఏ చట్టం రద్దు, జోనల్ అభివృద్ధి కౌన్సిల్ బిల్లులను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది, మంగళవారం మండలిలో ఈ బిల్లులు ప్రవేశపెడుతారు.
పెద్దల సభలో తమదే పైచేయి కావడంతో సర్కారు ప్రయత్నాలకు అడ్డుకట్ట వేయాలని విపక్షం భావిస్తోంది. అదే జరిగితే ఏం చేయాలన్న అంశంపై అధికార పక్షం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను మండలి ఆమోదించని పక్షంలో… బుధవారం మరోమారు ఈ బిల్లులను శాసనసభలో ఆమోదించి, తిరిగి మండలికి పంపించాలని భావిస్తున్నారు.