రేపు ఏపీ క్యాబినెట్ భేటీ.. పోలవరమే అజెండా ?

పోలవరానికి నిధుల విషయంలో కేంద్రం మొండి చేయి, స్థానిక ఎన్నికల వ్యవహారాలే ముఖ్య అజెండాగా రేపు ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. మూడు పరిశ్రమల ఏర్పాటు సహా అనేక అంశాలను మంత్రివర్గ భేటీలో చర్చించనున్నారు. సెప్టెంబర్ 3వ తేదీన జరిగిన మంత్రి మండలి సమావేశం తర్వాత మళ్లీ ఏపీ క్యాబినెట్ భేటీ రేపు జరగనుంది. కొద్ది రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలతో క్యాబినెట్ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.

జాతీయ ప్రాజెక్టు పోలవరానికి ఇవ్వాల్సిన నిధుల విషయంలో కేంద్రం మెలిక పెట్టడం రాజకీయంగా సంచలనంగా మారింది. ఈ అంశంపై ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ కూడా రాశారు. ముఖ్యమంత్రి జగన్ ప్రధాని నరేంద్ర మోడీని స్వయంగా పెళ్లి కలిసేందుకు సీఎంఓ పీఎం అపాయింట్మెంట్ కూడా కోరింది. ఇక క్యాబినెట్ మీటింగ్ లో ఈ అంశంపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరో వైపు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ఏపీలో పెద్ద చర్చే నడుస్తోంది. ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఎన్నికల కమిషన్ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించడం లాంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.