అరుదైన గాకర్స్ వ్యాధితో బాధపడుతున్న చిన్నారి వైద్యానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రూ.కోటి మంజూరు చేశారు. ఈ డబ్బుతో అత్యంత ఖరీదైన 10 ఇంజెక్షన్లను తొలి విడతగా జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా బాధితులకు ఆదివారం అందించారు. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం నక్కా రామేరానికి చెందిన కొప్పాడి రాంబాబు, నాగలక్ష్మి దంపతుల రెండున్నరేళ్ల కుమార్తె హనీకి గాకర్స్ వ్యాధి పుట్టుకతోనే ఉంది. ఈ వ్యాధి కారణంగా చిన్నారి కాలేయం పనిచేయదు.
ఇటీవల గోదావరి వరద బాధిత ప్రాంతాల్లో పర్యటన సందర్భంగా గంటి పెద్దపూడిలో సీఎం జగన్ పర్యటించారు. ఈ సందర్భంగా హనీ తల్లిదండ్రులు చిన్నారిని కాపాడాలంటూ ప్రదర్శించిన ప్లకార్డును ఆయన చూశారు. వెంటనే కాన్వాయ్‌ను ఆపించి వారితో మాట్లాడారు. హనీకి సోకిన వ్యాధి, చేయాల్సిన వైద్యంపై ఆరా తీశారు. చిన్నారి ప్రాణాలు నిలిపేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, ఖర్చు ఎంతైనా ఫర్వాలేదని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాను సీఎం ఆదేశించారు. కలెక్టర్ పంపిన ప్రతిపాదనలు పరిశీలించిన ప్రభుత్వం రూ.కోటి మంజూరు చేసింది.
ఆ నిధులతో తెప్పించిన ఇంజెక్షన్లను ఇవాళ జిల్లా కలెక్టర్ చేతులమీదుగా అమలాపురం ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో హనీ తల్లిదండ్రులకు అందజేశారు. గాకర్స్ వ్యాధి నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం 52 ఇంజెక్షన్లు మంజూరు చేసిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఒక్కో ఇంజెక్షన్ ఖరీదు రూ.1.25లక్షలు అని వివరించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి క్రమం తప్పకుండా చిన్నారికి ఇంజెక్షన్ ఇవ్వనున్నారు. చిన్నారి భవిష్యత్తు, ఎడ్యుకేషన్ పరంగా సాయం అందించాలని సీఎం ఆదేశించారని కలెక్టర్ తెలిపారు.