మంత్రులపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేబినెట్ సమావేశం పూర్తైన తర్వాత తన సహచరులతో జగన్ కాసేపు మాట్లాడారు. ఇటీవల కాలంలో ప్రతిపక్ష, విపక్ష నేతలు సర్కార్ పై చేస్తున్న విమర్శలకు మంత్రులు దీటుగా సమాధానం ఇవ్వడం లేదని జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు ప్రతిపక్షాలు చేసే విమర్శలను సరైన రీతిలో తిప్పికొట్టాలని సూచించారు.
ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తున్నప్పుడు కూడా ఎందుకు విమర్శలకు దీటుగా బదులివ్వలేకపోతున్నారని మంత్రులకు జగన్ క్లాస్ తీసుకున్నారు. లేదంటే మరోసారి మంత్రులను మార్చాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఆగ్రహంతో మంత్రులు మౌనంగా ఉండిపోయారు.
దిల్లీ లిక్కర్ స్కాం విషయంలో జగన్ పై టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టడంలో మంత్రులు విఫలమైనట్లుగా సీఎం భావిస్తున్నారు. టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి దిల్లీ లిక్కర్ స్కాంలో విజయసాయిరెడ్డితో పాటు వైఎస్ భారతి హస్తం ఉందని ఆరోపించారు. ఆ తర్వాత పలువురు టీడీపీ నేతలు కూడా విమర్శలు గుప్పించారు. ఇంతలా ఆరోపణలు చేస్తున్నా ఎందుకు స్పందించడం లేదని మంత్రులను జగన్ ప్రశ్నించారు. తేడా వస్తే ఇద్దరు మంత్రులను మార్చడానికి కూడా వెనుకాడనని వార్నింగ్ ఇచ్చారు.