ఢిల్లీ వరకూ చాలు..! విజయసాయిరెడ్డికి జగన్ షాక్ ?

-

విజయసాయిరెడ్డి.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఈ పేరు తెలియనివారు ఉండరు. ఆయన ఇప్పుడు అధికార వైసీపీలో నెంబర్ టూ గా వెలుగొందుతున్నారు. వైఎస్ జగన్ తర్వాత వైసీపీలో విజయసాయిరెడ్డిదే కీలకపాత్ర. జగన్ వ్యవహారాలన్నీ ఆయనే స్వయంగా చూస్తారని పేరుంది. ఎన్నికల ముందు జగన్ కు ఆయన గట్టి చేదోడువాదోడుగా నిలిచారు.

జగన్ ఆర్థిక వ్యవహారాలను సైతం విజయసాయిరెడ్డి చూసుకుంటారని పేరుంది. అయితే ఇటీవల విజయసాయిరెడ్డిపై జగన్ సీరియస్ అయ్యారా.. మీరు డిల్లీ వరకూ చూసుకోండి..చాలు నేను రాష్ట్ర వ్యవహారాలు చూసుకుంటా అంటూ గట్టిగా మందలించారా.. అంటే.. ఎక్కువ చేయకండి అంటూ పరోక్షంగా సిగ్నల్ ఇచ్చారా.. అవునంటోంది ఓ ప్రముఖ పత్రిక.

వైఎస్ జగన్ కు వ్యతిరేకం అని పేరుపడిన పత్రిక తన సంపాదకీయంలో ఈ విషయాన్ని ప్రస్తావించింది. రాష్ట్రంలో పెట్టుబడుల గురించి దేశ, విదేశీ సంస్థలు భయపడుతున్నాయంటూ రాసుకొచ్చిన ఆ పత్రిక.. వైసీపీకి చెందిన మంత్రులు, ఇతర నాయకులు చేస్తున్న ప్రకటనలు ఎలా ఉన్నా ఆంతరంగిక సమావేశాల్లో మాత్రం వారు కూడా ముఖ్యమంత్రి ధోరణిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారని రాసింది.

 

జగన్మోహన్‌రెడ్డికి తాము నేరుగా చెప్పలేరు కనుక ఇలాంటి వారంతా విజయసాయిరెడ్డిని కలిసి తమ ఆవేదనను పంచుకుంటున్నారట. అయితే విజయసాయిరెడ్డికి మాత్రం తన పాత్ర ఏమిటో స్పష్టంగా తెలుసునని.. ఇటీవల ఒక సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధించి ప్రస్తావించడానికి విజయసాయిరెడ్డి ప్రయత్నించగా.. ‘‘మిమ్మల్ని ఢిల్లీలో చూసుకోమన్నాగా! ఇక్కడి విషయాలు నేను చూసుకుంటాను’’ అని ఆయన మొహం మీదే ముఖ్యమంత్రి జగన్ అన్నారని.. ఆ పత్రిక రాసుకొచ్చింది.

దీంతో విజయసాయిరెడ్డికి తత్వం బోధపడిందని.. ట్వీట్లు చేసుకుంటూ కాలం గడిపేస్తున్నారని విమర్శించింది. ఇక అధికార యంత్రాంగం విషయానికి వస్తే ముఖ్యమంత్రి వ్యవహార శైలిపై వారు కూడా ఆందోళన చెందుతున్నారని రాసుకొచ్చిందా పత్రిక. అయితే ఈ పత్రిక సహజంగానే జగన్ కు వ్యతిరేకంగా రాస్తుంది కనుక.. ఇదంతా యాజ్ ఇట్ ఈజ్ గా జరిగినట్టు నమ్మలేం. కానీ నిప్పు లేకుండా పొగరాదేమో అన్న సందేహం కూడా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news