‘వైఎస్సార్ ఆరోగ్యశ్రీ’ పథకం పైలట్ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లాలో శ్రీకారం చుట్టారు. ఏలూరు ఇండోర్ స్టేడియంలో వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పైలట్ ప్రాజెక్టును ఆయన శుక్రవారం ప్రారంభించారు. అయితే తాజాగా ఈ పథకంపై జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు ఆ పథకం కింద 1059 రోగాలకు సేవలు అందిస్తుండగా.. ఇక నుంచి 2059 రోగాలకు సేవలు అందించనున్నట్లు ప్రకటించారు. ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్టు కింద పశ్చిమ గోదావరి జిల్లాలో ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ నాటికి అన్ని జిల్లాలో వర్తింపజేస్తామని వెల్లడించారు.
అంతేకాదు.. ఫిబ్రవరి నుంచి కేన్సర్ వ్యాధికి కూడా ఆరోగ్య శ్రీ వర్తిస్తుందని వివరించారు. ఏ రకమైన కేన్సర్ అయినా రూపాయి కూడా ఖర్చు కాకుండా వైద్యం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోబోతోందని తెలపారు జగన్. అంతేకాదు.. సంవత్సర ఆదాయం రూ.5లక్షలు ఉన్నవారికి కూడా ఆరోగ్య శ్రీ వర్తింపజేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఆరోగ్యశ్రీ కింద కోటి 42 లక్షల కార్డులను అందజేస్తామని తెలిపారు. అలాగే చికున్ గున్యా, మలేరియా, డెంగీ, వడదెబ్బకు కూడా ఆరోగ్యశ్రీని అమలు చేస్తామని అన్నారు. 510 రకాల మందులను కూడా అన్ని ప్రభుత్వ దవాఖానాల్లో ఉన్నాయని గుర్తు చేశారు.