ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ, జనసేన స్నేహం విషయంలో అసలు రెండు పార్టీల కార్యకర్తల అభిప్రాయం ఏ విధంగా ఉంది…? దీనిపై ఇప్పుడు అనేక ప్రశ్నలు వినపడుతున్నాయి. నాలుగేళ్ల పాటు కలిసి ఉన్న ఆ రెండు పార్టీలు ఎన్నికలకు ఏడాది ముందు పచ్చిబూతులు తిట్టుకున్న సంగతి తెలిసిందే. ఎన్నికల్లో రెండు పార్టీలు విడివిడిగా పోటి చేసాయి. తెలుగుదేశం 23 మంది ఎమ్మెల్యేలను గెలవగా పవన్ కళ్యాణ్ 1 ఎమ్మెల్యే సీటు గెలిచారు. రాజకీయంగా రెండు పార్టీలకు వైసీపీ ఊహించని విధంగా షాక్ ఇచ్చింది.
అది పక్కన పెడితే, ఇప్పుడు రెండు పార్టీలు కలిసి ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ కోసం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగినట్టే కనపడుతుంది. జనసేనను బిజెపిలో విలీనం చేసే అవకాశాలు ఉన్నాయని రాజకీయ పరిశీలకులు కూడా అంటున్నారు. తాజాగా అమరావతి ఉద్యమంలో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. ఈ నేపధ్యంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఇప్పుడు పవన్ కి మద్దతు వస్తుంది. ప్రధానంగా చంద్రబాబు పవన్ కి మద్దతుగా వ్యాఖ్యలు చేయడం మనం చూస్తున్నాం.
ఇది కార్యకర్తలకు చికాకుగా మారిందని అంటున్నారు. రెండు పార్టీల స్నేహం అనేది మంచిది కాదని, పవన్ కళ్యాణ్ ని దూరం పెడితేనే మంచిది అంటున్నారు కార్యకర్తలు. అసలు ఆయనతో స్నేహం వద్దని, మన పని మనం చూసుకుంటే చాలని అంటున్నారట తెలుగు తమ్ముళ్ళు. అటు సీనియర్ నేతలు కూడా పవన్ తో స్నేహం జగన్ కి కలిసి వస్తుందని, పవన్ బిజెపితో తిరుగుతున్నాడని, వాళ్ళ బాధ వాళ్ళు పడతారని మనకు ఎందుకు అని చంద్రబాబు ముందే కొందరు నేతలు ఇటీవల ఒక సమావేశ౦లో అసహనం వ్యక్తం చేసారట.