మాట తప్పను.. మడమ తిప్పను.. ఇదీ ఏపీ సీఎం జగన్ ఫాలో అయ్యే పాలసీ.. చాలా విషయాల్లో జగన్ దీన్ని ఫాలో అవుతారు. అందుకే ఏపీకి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు కోసం జగన్ ప్రయారిటీ ఇస్తున్నారు. కీలకమైన అంశాలను సైతం ఇందు కోసం పక్కన పెడుతున్నారు.
అందుకేనేమో… ఇప్పటికే ఆయన వాహన మిత్ర పేరుతో ఆటోవాలాలకు రూ. 10,000 రూపాయలు అందించారు. ఇందు కోసం దాదాపు 200 కోట్లు వెచ్చించారు. అయితే ఇప్పుడు ఆటోవాలాలతో పాటు మరి కొన్ని వర్గాలకూ జగన్ గుడ్ న్యూస్ చెప్పబోతున్నారని తెలుస్తోంది. ఇది కూడా పాదయాత్రలో ఇచ్చిన హామీయే. ఇప్పుడు ఆ హామీని జగన్ త్వరలోనే నిజం చేస్తారట.
ఆంధ్రప్రదేశ్ లోని రజకులకు, నాయీ బ్రాహ్మణులకు, టైలర్లకు ఏటా రూ. 10 వేల సాయం అందిస్తామని వైఎస్ జగన్ పాదయాత్రలో పలుసార్లు చెప్పారు. ఇప్పుడు ఆటోవాలాలకు పది వేల రూపాయల సాయం అందడంతో ఇక ఆ కులాల వారు కూడా జగన్ వైపు చూస్తున్నారు. మాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరుతున్నారు. ఇందుకు జగన్ కూడా సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ రెండు కులాలకు రూ. 10,000 సాయంపై వ్యవసాయ మంత్రి కన్నబాబు ఇటీవలే క్లారిటీ ఇచ్చారు. ఆటోవాలాల తరహాలోనే రజకులకు, నాయీ బ్రాహ్మణులకు కుడా రూ. 10,00 ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీ త్వరలోనే అమలవుతుందని చెప్పారు. ఇందుకు సంబంధించిన కసరత్తు జరుగుతోందని కన్నబాబు చెప్పారు. అంటే ఏదేమైనా సరే.. తన మేనిఫెస్టోయే తనకు బైబిల్, ఖురాన్, భగవద్గీత అన్న మాటలను జగన్ పాటిస్తున్నారన్నమాట.