గడిచిన మూడు మాసాలుగా రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం ఎన్నికల కమిషనర్ వ్యవహారం. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో మంత్రి మండలి సిఫారసు మేరకు నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా 2016లో నియమించారు. మొత్తం ఐదేళ్లపాటు ఆయన ఈ పదవిలో ఉంటారు. అయితే, గత ఏడాది నవంబరులో ప్రారంభమైన స్థానిక ఎన్నికల ప్రక్రియ విషయంలో రేపో మాపో ఎన్నికలు జరుగుతాయి.. అనుకుంటున్న సమయంలో నిమ్మగడ్డ అనూహ్యంగా తన అధికారాలను వినియోగించి.. ఎన్నికలను వాయిదా వేశారు.
అయితే, వాస్తవానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తాను ఏం చేయాలని భావించినా.. ప్రభుత్వంతో చర్చించాల్సిన అవసరం ఉందనేది వాస్తవం. కానీ, ఎన్నికల వాయిదాపై నిమ్మగడ్డ.. ప్రస్తుత ప్రభుత్వంతో ఎక్కడా చర్చించడం కానీ, కమిషన్‌లోని సీనియర్ అధికారులతోనూ చర్చించిన సందర్భం కానీ మనకు ఎక్కడా కనిపించలేదు. ఇది ప్రభుత్వానికి-రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు మధ్య తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ క్రమంలోనే సీఎం జగన్ నేరుగా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌లో సంస్కరణలకు తెరదీశారు. ఈ పదవిలో ఉండేవారి పదవీ కాలాన్ని మూడేళ్లకు కుదిస్తూ.. కొత్త కమిషనర్‌గా కనగరాజ్‌ను నియమించారు.
ఇక, ఈ విషయం కోర్టుకు వెళ్లడం, నిమ్మగడ్డకు అనుకూలంగా తీర్పు రావడం తెలిసిందే. అయితే, దీనిని కూడా ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేయడం.. తాజాగా వచ్చిన తీర్పులోనూ ప్రభుత్వానికి ఉపశమనం లేకపోవడం గమనార్హం. మొత్తంగా ఈ విషయం ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా మారింది.ఇక, ఇప్పుడు ప్రభుత్వానికి ఉన్న ఏకైక మార్గం.. హైకోర్టు న్యాయమూర్తికి ఉండే అధికారాలు.. హోదా ఉన్న కమిషనర్‌ను అవిశ్వాసంతోనే తొలగించాల్సిన పరిస్థితి రావడం. దీనిపై అసెంబ్లీలో తీర్మానం చేసి.. తద్వారా ఆయనను తొలగించే అవకాశం ఉందని న్యాయనిపుణుల నుంచి సూచనలు వస్తున్నాయి.
అయితే, అవిశ్వాసానికి ఉండే కారణాలు కూడా బలంగా ఉండాలి. దీనికి నిమ్మగడ్డ నుంచి కనిపిస్తున్న ఏకైక.. ప్రధాన కారణం.. ఆయన ప్రభుత్వాన్ని కించపరచడమే! లేదా ప్రభుత్వాన్ని లెక్కచేయకుండా.. తనంతట తానుగా నిర్ణయాలు తీసుకోవడం! ఈ రెండు కారణాలతో ఆయనపై అవిశ్వాసం కొరడా ఝళిపించేందుకు అవకాశం ఉంది. అయితే, ఇది అసెంబ్లీలో ఆమోదం పొందినా.. శాసన మండలిలోనూ ఆమోదం పొందాల్సిన అవసరం ఉంది. మండలిలో టీడీపీకి బలం ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది. కానీ, ప్రభుత్వం ముందు .. ఇంతకు మించిన మార్గం లేదనేది నిపుణుల సూచన. మరి జగన్ వ్యూహం ఎలా ఉంటుందో చూడాలి.