ఆంధ్రప్రదేశ్ లో గత 24 గంటల్లో 9 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి అని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. గడిచిన 24 గంటల వ్యవధిలో ఏపీలో 55,692 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 9,996 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని హెల్త్ బులిటెన్ లో ప్రభుత్వం వెల్లడించింది. ఒక్క రోజులో రాష్ట్రంలో 82 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారని ప్రభుత్వం పేర్కొంది.

తూర్పుగోదావరి, చిత్తూరు జిల్లాల్లో వరుసగా 1504, 963 కేసులు అత్యధికంగా నమోదు అయ్యాయి. అలానే తాజాగా కరోనాతో 82 మంది మృతి చెందగా అందులో తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాల్లో పది మంది చొప్పున, అనంతపురం జిల్లాలో ఎనిమిది, కడప జిల్లాలో ఏడుగురు, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఆరుగురు చొప్పున అసువులు బాసారు. ఇక విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఐదుగురు, కృష్ణా జిల్లాలో ఒకరు చొప్పున మృత్యువాతపడ్డారు. దీంతో మృతుల సంఖ్య 2,378కి చేరింది.