వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సీఎస్ ఆదిత్యనాధ్ దాస్ అత్యవసరంగా భేటీ అయ్యారు. ఎన్నికల విధుల నిర్వహణ విషయమై ఉద్యోగ సంఘ నేతలతో చర్చలు జరపనున్నట్టు చెబుతున్నారు. కరోనా కాలంలో ఎన్నికల నిర్వహణ విషయమై ఉద్యోగులు అభ్యంతరాలు తెలిపిన సంగతి తెలిసిందే. తమ అభ్యంతరాలను.. సూచనలను సీఎస్ దృష్టికి ఉద్యోగ సంఘాలు తీసుకెళ్లనున్నట్టు చెబుతున్నారు. ఇక రేపు ఎస్ఈసీతో వీడియో కాన్ఫరెన్స్ ఉండడంతో సీఎస్- ఉద్యోగ సంఘాల భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.
మరోపక్క ఆయనను కలవడానికి ముందు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ వెంకట రామిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎన్నికల విధుల్లో పాల్గొనాలని ఉద్యోగులను ఇబ్బంది పెట్టొద్దని మాత్రమే కోరామని కానీ మా వాదనలు వినకుండానే కోర్టు నిర్ణయం తీసుకుందని అన్నారు. మాకు న్యాయం జరగలేదు, అయినా కోర్టు తీర్పును మేం గౌరవిస్తామని అన్నారు. ఇప్పటికే కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి వర్క్ ఫ్రం హోం ఉందని, ఎన్నికలకు వారికి మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నామని అన్నారు. ఒకవేళ ఎన్నికల విధుల్లో ఉండి కరోనా సోకి మృతి చెందితే రూ. 50 లక్షల పరిహరం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.