- కేసీఆర్ ఆయనను సీఎం చేయరు..
- సీఎం కుటుంబంలో సమస్యలున్నాయ్ !
- తాజాగా కీలక వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి
హైదరాబాద్ః తన కుమారుడైన తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను ముఖ్యమంత్రిగా తీర్చిదిద్దే ఆలోచన రాష్ట్ర సీఎం కేసీఆర్‌కు ప్రస్తుతం లేదని మాల్కాజ్‌గిరి ఎంపీ, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అన్నారు. అలాగే, ముఖ్యమంత్రి కుటుంబం, కేటీఆర్ సీఎం అనే అంశాలకు సంబంధించి రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రిపదవులు కొరుకునే వారే సీఎంగా కేటీఆర్ పేరును పదేపదే ప్రస్తావిస్తున్నారని తెలిపారు.
సీఎం కేసీఆర్ కుటుంబం గురించి మాట్లాడుతూ.. ఇప్పటికే ముఖ్యమంత్రి కుటుంబంలో సమస్యలు ఉన్నాయనీ, ఈ పరిస్థితుల్లో కేటీర్‌ను సీఎం చేయరని తెలిపారు. కేటీర్ సమర్థత కేసీఆర్ కు బాగా తెలుసునని వెల్లడించారు. ఇక రాష్ట్రంలో సీఎం ఎవరవుతారనేది కేవలం కల్వకుంట్ల వారి కుటుంబ సమస్యమాత్రమేనని పేర్కొన్నారు.
ఇక కేటీఆర్‌ను సీఎం కాకుండా అడ్డుకునేది ఆ పార్టీకి చెందని ప్రధానమైన ముగ్గురు నాయకులేనంటూ సంచలన కామెంట్స్ చేశారు. కేటీఆర్ సీఎం అయితే గనక ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు హరీష్ రావు, సంతోష్‌రావు, కవితలకే అధిక సమస్యలు ఉంటాయనీ, వారే కేటీఆర్‌ను అడ్డుకుంటారని పేర్కొన్నారు. ఇక టీఆర్ఎస్ నేతలపై ఘాటుగానే విమర్శలు గుప్పించారు. మంత్రిపదవులు కావాలనుకునే వారు మాత్రమే కేటీఆర్ సీఎం కావాలని కోరుకుంటున్నారని ఆరోపించారు.
కేసీఆర్ కంటే కేటీఆరే అధికంగా ప్రజలను మోసగించే అబద్దాలు చేబుతారనీ, ఆయనకు సీఎం అయ్యే అర్హత లేదంటూ ఆరోపించారు. అలాగే, రాష్ట్ర గల్లీలలో విమర్శలు చేసుకుంటున్న బీజేపీ, టీఆర్ఎస్‌లు.. ఢిల్లీలో మాత్రం బలమైన బంధంతో ముందుకు సాగుతున్నాయని విమర్శించారు. దీనిలో భాగంగానే జీహెచ్ ఎంసీ మేయర్ పదవిని బీజేపీ వదులుకోనున్నారని పేర్కొన్నారు. ఇక సాగు చట్టాలను వ్యతిరేకించిన కేసీఆర్.. ఢిల్లీ పర్యటన అనంతరం ఎందుకు మౌనం వహిస్తున్నారని రేవంత్ ప్రశ్నించారు.