ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల పుణ్యమా అని రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఊహించని విధంగా ఎన్నికలను వాయిదా వేయడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆగ్రహంగా ఉన్నారు. తాజాగా రాష్ట్రంలో ఎన్నికలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి నీలం సహాని ఎన్నికల కమీషనర్ కి లేఖ రాసారు. ఎన్నికలను నిర్వహించాలని ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు.
ఎన్నికలు యథావిధిగా చేపట్టేందుకు కార్యాచరణ చేపట్టాలని ఆమె కోరారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి లేదని పరిస్థితి అదుపులోనే ఉందని ఆమె లేఖలో వివరించారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంటోందని లేఖలో కమీషనర్ కి ఆమె వివరించారు. ఎన్నికల నిర్వహణకు అడ్డంకి లేకుండా కరోనా నియంత్రణ చర్యలు చేపట్టవచ్చని ఆమె పేర్కొన్నారు.
పోలింగ్ రోజున జనం గుమిగూడకుండా నియంత్రించవచ్చని తెలిపారు. మరో 3,4 వారాలపాటు కరోనా నియంత్రణలోనే ఉంటుందని ఆమె వివరించారు. ఇక ఇదిలా ఉంటే ఈ ఎన్నికల వాయిదాపై ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్ట్ కి వెళ్ళే ఆలోచనలో ఉంది. కాని కేంద్ర పెద్దలతో మాట్లాడిన తర్వాతే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని రమేష్ కుమార్ మీడియాకు వివరించారు.