ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీని బదిలీ చేస్తూ, జగన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఒక చీఫ్ సెక్రటరీని బదిలీ చెయ్యటం పై, దేశ వ్యాప్తంగా చర్చ అయ్యింది. ఏరి కోరి తెచ్చుకున్న వ్యక్తిని జగన్ అంత వేగంగా ఎందుకు బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు అనేది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. ఏపీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ.సుబ్రహ్మణ్యం వేటుపై ఢిల్లీ పెద్దలు ఆగ్రహంతో ఉన్నారు. ఈ వేటుకు గల కారణాలపై కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తున్నాయి. అలాగే సీఎస్ పట్ల వ్యవహరించే తీరు ఇదేనా?
అని ప్రభుత్వ వర్గాలకి అక్షింతలు వేసినట్టు సమాచారం. మరోవైపు తనను చీఫ్ సెక్రటరీ నుంచి తప్పించి ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డైరెక్టర్ జనరల్‌గా నియమించడంతో సుబ్రమణ్యం అలకవహించారు. నెలరోజుల పాటు సగం వేతనంతో కూడిన సెలవుపై వెళ్లారు. ఇవాళ్టి నుంచి డిసెంబర్ 6 వరకూ సెలవులో ఉంటారు. వైఎస్. జగన్ వైఖరితో ఆగ్రహంతో ఉన్న ఎల్వీ.సుబ్రహ్యణ్యం కేంద్ర సర్వీసులకు వెళ్లాలనే యోచనలో ఉన్నారనే ప్రచారం గత రెండు రోజులుగా జరుగుతుంది. ఇక ఆయన సర్వీసులకు కూడా కేంద్ర ప్రభుత్వం ఉపయోగించుకోవాలనే ఆలోచననంలో ఉంది.
కేంద్ర విజిలెన్స్ కమిషనర్ గా నియమించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ వార్తలను నిజమే అంటున్నాయి కేంద్ర ప్రభుత్వ వర్గాలు. ఆయన్ను కేంద్ర విజిలెన్స్ కమీషనర్ గా నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడకపోయినా ఆయనకు ఇప్పటికే పదవిని కూడా ఖరారు చేసినట్టు ప్రచారం జరుగుతుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం సెలవులో ఉన్న ఆయన ఢిల్లీ వెళ్ళింది ఇందుకేనని అంటున్నాయి రాజకీయ వర్గాలు.