ఏపీ ఈఎస్ఐ స్కాంలో చార్జిషీట్ దాఖలుకు రంగం సిద్ధమయినట్టు చెబుతున్నారు. మొదటి చార్జిషీట్లో ముగ్గురిపై ఏసీబీ అభియోగాలు నమోదు చేసినట్టు చెబుతున్నారు. ఏసీబీ చరిత్రలో అతి తక్కువ కాలంలో చార్జిషీట్ దాఖలు చేసిన కేసుగా ఈ ఏపీ ఈఎస్ఐ స్కాం నిలిచిపోనుంది. మందులు, పరికరాలు సరఫరా చేసిన సప్లయర్స్ మీద కూడా ఈ చార్జిషీట్ లో అభియోగాలు నమోదు చేసినట్టు చెబుతున్నారు. ముగ్గురు సప్లయర్స్ మీద అభియోగాలను ఏసీబీ నమోదు చేసింది.
ఇప్పటికే 12 మందిని అరెస్ట్ చేసిన ఏసీబీ, మొత్తం 19 మంది నిందితులపై కేసు నమోదు చేసింది. కొత్తగా మరో ముగ్గురి మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇక ఈ కేసులో మాజీ మంత్రి అచ్చెన్నానాయుడుని ఏసీబీ అరెస్టు చేసింది. బెయిల్ రాకపోవడంతో జైల్లోనే ఉన్నాడు ఆయన. ఈరోజు హైకోర్టులో బెయిల్ పిటిషన్ పై విచారణ జరగగా ఎనిమిది వందల పేజీలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది ఏసీబీ. దీంతో తదుపరి విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది హైకోర్టు. ఇక ఈఎస్ఐ స్కామ్ పై రేపు ఏసీబీ కీలక ప్రకటన చేయనుందని అంటున్నారు.