విజయవాడలో జరిగిన కోవిడ్ హాస్పిటల్ అగ్నిప్రమాదం ఘటన మీద మొన్న మాజీ ఎంపీ రాయపాటి కోడలిని విజయవాడ ఏసీపీ ఒక రోజంతా విచారించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే కుటుంబానికి చెందిన రాయపాటి తమ్ముడు కుమార్తె, డాక్టర్ శైలజను కూడా విజయవాడ పోలీసులు విచారించారు. ఆమె పని చేస్తున్న గుంటూరు రమేష్ హాస్పటల్ కే వెళ్లి అక్కడే విచారించినట్టు సమాచారం. ఇక ఈ విచారణ అనంతరం డాక్టర్ శైలజ మాట్లాడుతూ కోవిడ్ సెంటర్లు ఎక్కడైనా విజిట్ చేసారా అని పోలీసులు అడిగారని, తాను 7,8 నెలలుగా వైద్య వృత్తి లో లేనని చెప్పానని అన్నారు.
తన పుట్టుపూర్వోత్తరాలు కూడా అడిగారన్న ఆమె, మొన్న జరిగిన అగ్నిప్రమాదం అనుకోకుండా జరిగిన సంఘటనన్న ఆమె పెద్ద ఎత్తున వత్తిళ్ళు వస్తే నే కోవిడ్ సెంటర్లు నిర్వహణకు డాక్టర్ రమేష్ ముందుకు వచ్చారని అన్నారు. చాలా చోట్ల అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి కానీ ఎక్కడా ఇంతలా వేధింపులు లేవని అన్నారు. 30 ఏళ్ళుగా తెచ్చుకున్న పేరును ఇప్పుడు కులం పేరుతో ఇలా దుష్ప్రచారం చేయటం బాధగా ఉందని అన్నారు. ప్రభుత్వం అనుమతిస్తేనే ప్రైవేటు కోవిడ్ సెంటర్ ని ఏర్పాటు చేశారని ఆమె అన్నారు. రమేష్ బాబు ని రమేష్ చౌదరి గా ప్రచారం చేస్తుంటే అది టార్గెట్ చేసినట్టుగానే కనపడుతుందని ఆమె పేర్కొన్నారు.