పదవ తరగతి పరీక్షల నిర్వహణపై ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నామని..జులై 26 నుంచి ఆగస్ట్ 2 వరకు పదవ తరగతి పరీక్షలు నిర్వహించడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని పాఠశాల విద్యా శాఖ కమీషనర్ చినవీరభద్రుడు పేర్కొన్నారు. పదవ తరగతి పరీక్షలకు 6.28 లక్షల మంది విద్యార్ధుల హాజరవుతారని.. 4 వేల సెంటర్లలో పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణలో 80 వేల మంది ఉపాద్యాయులు, సిబ్బంది పాల్గొంటారని.. 11 పేపర్ల బదులు ఏడు పేపర్లకి పరీక్షలు నిర్వహించాలని సూచిస్తున్నామన్నారు.
సెప్టెంబర్ 2 లోపు పరీక్షా ఫలితాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. గత ఏడాది కరోనా కారణంగా పరీక్షలు రద్దు చేయాల్సి వచ్చిందని.. ఈ ఏడాది సెకండ్ వేవ్ కారణంగా పరీక్షలు వాయిదా వేయాల్సి వచ్చిందని తెలిపారు. పరీక్షలు నిర్వహించకపోతే విద్యార్ధులకి నష్టం కలుగుతుందని.. కోవిడ్ నిబంధనలు అనుసరించి పరీక్షలు నిర్వహించడానికి సిద్దంగా ఉన్నామని ప్రకటించారు. రేపు సిఎం వైఎస్ జగన్ విద్యా శాఖపై సమీక్షలో పరీక్షల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు.