రాష్ట్రంలో దేవాలయాల కేంద్రంగా జరుగుతున్న వరుస ఘటనలపై సీఎస్ ఆదిత్యనాధ్ దాస్ మీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆదిత్యనాధ్ దాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో మత సామరస్యాన్ని కాపాడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు. మత సామరస్యాన్ని కాపాడేలా రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని ఆయన ప్రకటించారు. రాష్ట్ర స్థాయిలో సీఎస్ చైర్మన్ గా డీజీపీ వైస్ చైర్మన్ గా మత సామరస్య కమిటీ ఏర్పాటు చేయగా జిల్లాల్లో కలెక్టర్ చైర్మన్ గా, ఎస్పీ వైస్ చైర్మన్ గా కమిటీలు ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న తరహా ఘటనలు భవిష్యత్తులో జరగ్గకుండా ఈ కమిటీలు పర్యవేక్షిస్తాయని, ఈ కమిటీలు ఎప్పటికప్పుడు భేటీ అవుతూ ఉంటాయని పేర్కొన్నారు. ఏపీలో దేవాలయాల కేంద్రంగా జరుగుతోన్న ఘటనల్లో దోషులను పట్టుకుంటున్నామని దేవాలయాల్లో జరిగే ఘటనల్లో ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే మాట అవాస్తవమని అన్నారు. మత సామరస్యాన్ని దెబ్బ తీసే విధంగా ఘటనలు జరుగుతున్నాయని బలవంతపు మత మార్పిడులుంటే నిబంధనల ప్రకారం వ్యవహరిస్తామని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కేంద్రం ఎలాంటి నివేదిక కోరలేదన్న ఆయన సీఎం, హోం మంత్రి, డీజీపీ వంటి వారు ప్రజా సేవకులు.. వీరికి మతాలను ఆపాదించడం సరికాదని అన్నారు.