క్రిమినల్‌ కేసు ఉంటే కోర్టు అనుమతితోనే పాస్‌పోర్టు పునరుద్ధరణ: ఏపీ హైకోర్టు

-

క్రిమినల్ కేసు పెండింగ్ లో ఉన్న వారికి పాస్ పోర్టు పునరుద్ధరణ కావాలంటే కోర్టు అనుమతి తప్పనిసరి అని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. కోర్టు నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) సమర్పించాల్సిన అవసరం లేకుండానే పాస్‌పోర్టును పునరుద్ధరించేలా(రెన్యువల్‌) పాస్‌పోర్టు అధికారులను ఆదేశించాలని పిటిషనర్లు చేసిన అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. విచారణ కోర్టు ఇచ్చిన ఎన్‌వోసీ/అనుమతి ఉత్తర్వులను సమర్పించాకే పిటిషనర్ల పాస్‌పోర్టును పునరుద్ధరించే వ్యవహారాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సంబంధిత ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారులను ఆదేశించింది.

మరోవైపు న్యాయస్థానం అనుమతి ఉత్తర్వులిచ్చాక కూడా కోర్టులో క్రిమినల్‌ కేసు పెండింగ్‌లో ఉందనే ఒక్క కారణంతో పాస్‌పోర్టును పునరుద్ధరించకుండా ఉండటానికి వీల్లేదని హైకోర్టు తేల్చిచెప్పింది. ఇప్పటికే భారతదేశం నుంచి విదేశాలకు వెళ్లిన పిటిషనర్లు, లేదా విదేశాలకు వెళ్లాలనుకుంటున్న వారు ఎన్‌వోసీ కోసం క్రిమినల్‌ కోర్టులను ఆశ్రయించాలని సూచించింది. ఆయా కేసులోని పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని తగిన ఉత్తర్వులివ్వాలని విచారణ కోర్టులను ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరీ ఇటీవల ఈ మేరకు తీర్పు ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news