బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్ బాస్ రియాలిటీ షో పై ఏపీ హై కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే బిగ్‌బాస్ షో అశ్లీలత, అసభ్యతను ప్రోత్సహించేదిగా ఉందని, దీనివల్ల యువత పెడదారి పడుతోందంటూ తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి 2019లో హై కోర్టులో పిల్ వేశారు. దీంతో విచారం చేపట్టిన హై కోర్టు.. మంచి పిల్ వేశారంటూ పిటిషనర్‌ను ప్రశంసించడమే కాకుండా.. ఈ పిల్ పై సోమవారం విచారిస్తామని చెప్పింది. బిగ్‌బాస్ వంటి షోల వల్ల యువత పెడదారిపడుతోందని హై కోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయితే.. సమాజంలో ఇలాంటి వాటివల్ల విపరీత పోకడలు పెరిగిపోతున్నాయని, అభ్యంతరకర షోల విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ టి.రాజశేఖరరావుతో కూడిన ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది.
దాదాపు 3 సంవత్సరాలుగా.. ఈ పిల్ పై విచారణ జరగకపోవడంతో.. నిన్న పిటిషనర్ తరపు న్యాయవాది గుండాల శివప్రసాద్‌రెడ్డి దీనిపై అత్యవసర విచారణ జరపాలని కోర్టును కోరారు. దీంతో హై కోర్టు ఈ పిల్ పై విచారణ చేస్తామని.. అంతేకాకుండా.. తమ పిల్లలు బాగున్నారని, ఇలాంటి షోలతో తమకేం పని అని ప్రజలు భావిస్తున్నారని పేర్కొంది. ఇతరుల గురించి పట్టించుకోకపోతే భవిష్యత్తులో మనకు సమస్య ఎదురైనప్పుడు వారు కూడా పట్టించుకోరని వ్యాఖ్యానించింది ఏపీ హై కోర్టు.