రాళ్లు : ఒక రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఇలాంటివి లేవు అని చెప్పేందుకు వీల్లేదు కానీ రాళ్ల దాడి కారణంగా ప్రత్యర్థులు బలపడతారు. ఆ విషయం ముందుగా వైసీపీ తెలుసుకోవాలి. రాళ్ల దాడి చేసిన వారు ఓ ఎమ్మెల్యే అనుచరుడు అని గుర్తించాక కూడా చర్యలు లేవు. కనీసం పశ్చాత్తాపం కూడా లేదు. ఇది చాలా తప్పు అని టీడీపీ అంటోంది. గుంటూరు జిల్లాలో తుమ్మపూడిలో జరిగిన ఘటన అత్యంత అమానవీయం. ఓ వివాహిత అయిన హత్యాచార బాధితురాలిని పరామర్శించేందుకు వెళ్లిన లోకేశ్ పై రాళ్ల దాడి జరిగింది. దీనిని ప్రశ్నిస్తున్న విపక్షంపై మాటల దాడి జరుగుతోంది. రాళ్లను ఏం చేయాలి .. ఆ దాడిని అలానే ఆపి వాళ్ల ప్రవర్తన ఇంతే అని తప్పుకుపోవాలి అని అంటున్నారు టీడీపీ కార్యకర్తలు. లేదంటే ఆ రాళ్లే మాకు రేపటి వేళ పునాది రాళ్లు కావాలని ఆశించాలి ఈ నాయకులు.
పూలు : గత పాలనలో తండ్రి చంద్రబాబు ముఖ్యమంత్రి కనుక పూలు పడ్డాయి. మంత్రి హోదాలో ఆయనకు గౌరవం దక్కింది.
ఆ రోజు పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా లోకేశ్ నిర్ణయాలకు తిరుగులేదు. సచివాలయంలో ఆయన మాటకు ఎదురే లేదు. ఆ విధంగా ఆయన పూల వానలో తడిసి మురిశారు. ఆ పదవి ఎటువంటి కష్టం లేకుండా వచ్చింది. ఆయన్ను ఎమ్మెల్సీ చేసి మంత్రిని చేశారు కనుక పూల వాన అడగకుండానే వచ్చి పలకరించి వెళ్లింది.
ముళ్లు : ఇప్పుడాయన విపక్షంలో ఉన్నారు కనుక ముళ్లు ఉంటాయి వాటిని దాటుకుని వెళ్లాలి. గుచ్చుకుంటే బాధను భరించి ప్రయాణం సాగించాలి. కనుక గుంటూరు లో జరిగిన ఘటన ఆయనొక పాఠం అయితే చాలు. పగలూ ప్రతీకారాలూ లాంటి పెద్ద పెద్ద మాటలు ఎందుకులే కానీ ప్రత్యర్థులను క్షమించి, మంచి నాయకుడిగా లోకేశ్ పేరు తెచ్చుకుంటే చాలు.
రాజకీయాల్లో ఏవీ శాశ్వతం కాదు అన్న సత్యం నుంచి ఎన్నో నేర్చుకోవచ్చు.అశాశ్వత పదవుల కారణంగా గతంలో కొన్ని తప్పిదాలు నమోదు అయి ఉన్నాయి. అశాశ్వత ప్రాతిపదికన ఉన్న పదవుల కారణంగానే అధికార దుర్వినియోగం కూడా జరిగి ఉంది. అవి అశాశ్వతం అని గుర్తించకపోవడం వల్లనే తరువాత కాలంలో నాయకులు నియోజకవర్గాల్లో తిరగలేని తలెత్తుకోలేని రోజులు కూడా ఉన్నాయి.
అహంకు విరుగుడు ఎవరిని వారు తెలుసుకోవడమే. ఏది సత్యం ఏది వెంట ఉండి నడిపించే సూక్తి అన్నది తెలుసుకుంటే చాలు. తరువాత మళ్లీ పదవులు వస్తాయి. మళ్లీ మంచి పనులు చేసి ప్రజల మెప్పు మరియు నమ్మకం పొందేందుకు అవకాశాలు వస్తాయి. ఆ విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు నారా లోకేశ్ ఇప్పుడు కొన్ని ఇబ్బందుల్లో ఉన్నా కూడా రేపటి వేళ మంచి ఫలితాలే అందుకోనున్నారు అని అంటున్నారు ఆ పార్టీ అభిమానులు మరియు కార్యకర్తలు.