ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు వైసీపీ ఎన్డిఎలో చేరుతుంది అనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది. రాజకీయంగా ఇన్నాళ్ళు పరోక్ష స్నేహం చేసిన బిజెపి, వైసీపీ ఇప్పుడు ప్రత్యక్ష స్నేహానికి సిద్దమయ్యాయి అని అధికార పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకుని టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఈ తరుణంలోనే వివాదాస్పదంగా మారిన జాతీయ పౌరసత్వ సవరణ చట్టం విషయంలో వైసీపీ సర్కార్ ఏ విధంగా వ్యవహరిస్తుంది అనేది అర్ధం కాలేదు.
దీనిపై ఇప్పటికే జగన్ కూడా కీలక ప్రకటన చేసారు. తాము రాష్ట్రంలో ఎన్నార్సిని అమలు చేసేది లేదని చెప్పారు. ఈ తరుణంలో మంత్రి అంజాద్ భాషా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. ఎన్డిఎలో తమ పార్టీ చేరేది లేదని ఆయన ఈ సందర్భంగా స్పష్టంగా చెప్పారు. ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా ఎంతవరకైనా పోరాటం చేస్తామని ఆయన తేల్చి చెప్పారు. తనకు పదవులు కాదని స్పష్టం చేసిన మంత్రి,
నియోజకవర్గ ప్రజలే ముఖ్యమని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఎన్‌ఆర్‌సీపై కేంద్రం ముందుకెళ్తే రాజీనామాకైనా సిద్ధమని ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయడానికి సీఎంను ఒప్పిస్తా అన్న ఆయన, ఎన్డీయేలో చేరుతామని అసత్య ప్రచారం చేస్తున్నారని, మా ప్రభుత్వం ఎన్డీయేలో చేరే ప్రసక్తే లేదని వ్యాఖ్యానించారు. 151 సీట్లు గెలిచామన్న ఆయన ఎందుకు ఎన్డీయేలో కలుస్తామని ఎదురు ప్రశ్నించారు.