ఏపీ రాజకీయాల్లో అనూహ్యమైన మార్పు చోటు చేసుకుంటుందా? రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసంజగన్ ఏదైనా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.. అన్న మంత్రి బొత్స వ్యాఖ్యల అంతరార్థం ఏంటి? గత కొన్నాళ్ల కిందట అస్సలు అప్పాయింట్‌మెంట్ ఇచ్చేందుకు వెనుకాడిన కేంద్ర హోం మంత్రి, బీజేపీ మాజీ జాతీ య సారధి అమిత్ షా ఇప్పుడు జగన్‌తో దాదాపు గంటసేపు మంతనాలు జరపడం వెనుక ఉన్న వ్యూహం ఏంటి? నిజంగానే వైసీపీ ఎన్డీయేలో చేరిపోతుందా? చేరితే.. నిజంగానే ఏపీకి మంచి జరుగుతుందా? గత అనుభవాలు ఏం నేర్పుతున్నాయి? ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలే అనేకం రాష్ట్ర రాజకీయ పరిశీలకులను వెంటాడుతున్నాయి.
విషయంలోకి వెళ్తే.. ప్రస్తుత పరిస్థితిలో కేంద్రంలోని బీజేపీకి, రాష్ట్రంలోని వైసీపీకి జట్టుకట్టాల్సిన అవస రం ఉందా? అంటే ఉందనీ చెప్పలేం.. లేదనీ చెప్పలేం. ఏపీలో పాగా వేయాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. అదేసమయంలో రాష్ట్రంలో ముప్పై ఏళ్లపాటు సీఎంగా ఉండాలని భావిస్తున్న జగన్‌కు రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తీసుకురావడంతోపాటు తన ప్రత్యేక నినాదమైన ప్రత్యేక హోదాను సాధించా ల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఈ నేపథ్యంలో ఇష్టమో.. కష్టమో.. జగన్‌కు కేంద్రంలోని బీజేపీతో చేతులు కలపాల్సిన అవసరం ఉందని తెలుస్తోంది. ఇదే విషయాన్ని మంత్రి బొత్స చెప్పుకొచ్చారు.ఇక, బీజేపీ విషయాన్ని పరిశీలిస్తే.. పవన్‌తో పొత్తు పెట్టుకున్నా.. తర్వాత ఆయన ప్రొఫైల్, ఎన్నికల్లో ఆ యన సాధించిన ఓటు షేర్ వంటివి పరిశీలించిన తర్వాత .. ఆయన కలిసి నడిస్తే.. వచ్చే ప్రయోజనాల ను భేరీజు వేసుకున్నాక.. కుదిరితే.. అంతకన్నా బలవంతుడితో పొత్తు పెట్టుకోవడమే మంచిదనే అభిప్రా యానికి బీజేపీ వచ్చిందని అంటున్నారు.
ఈ నేపథ్యంలోనే ఇవ్వాలా వద్దా.. అనే స్థాయి నుంచి ఎన్నో స మస్యల్లో ఉన్నప్పటికీ, ఎంతో బిజీగా ఉన్నప్పటికీ అమిత్ షా.. జగన్‌కు గంటపాటు అప్పాయింట్‌మెంట్ ఇచ్చి.. రాష్ట్ర సమస్యలను ఓపికగా విన్నారు. ఈ మొత్తం పరిణామం చూస్తే.. బీజేపీకి వ్యక్తిగత ప్రయోజనం, జగన్‌కు రాష్ట్ర ప్రయోజనాల నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య పొత్తుకు ప్రాధాన్యం ఏర్పడిందని అంటున్నారు పరిశీలకులు.