పరిశ్రమలకు రూ.1,124 కోట్ల ప్రోత్సాహకాలు విడుదల చేసిన ఏపీ

అమరావతి : ఎంఎస్‌ఎంఈలు, టెక్స్‌టైల్‌ స్పిన్నింగ్‌ మిల్స్‌కు ఊతమిస్తూ రూ.1,124 కోట్ల ప్రోత్సాహకాలు విడుదల చేసింది జగన్‌ సర్కార్‌. క్యాంపు కార్యాలయంలో వర్చువల్ గా ప్రోత్సాహకాలు విడుదల చేశారు సీఎం జగన్. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ… ఎంఎస్‌ఎంఈలు, స్పిన్నింగ్‌ మిల్స్‌ను ఆదుకునేందుకు ఇవాళ ఈ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామన్నారు.

తమకు తాము శ్రమ చేస్తూ మరో 10 మందికి ఉద్యోగాలు కల్పించే కార్యక్రమాన్ని ఎంస్‌ఎంఈలు చేస్తున్నారని… రాష్ట్రవ్యాప్తంగా సుమారు 97,423 మంది ఎంఎస్‌ఎంఈలు నడుపుతున్నారని వెల్లడించారు.
మరో 10 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారని… మధ్యతరహా పారిశ్రామిక వేత్తలు పెట్టుబడులు పెట్టేవారు సహా, వీరందరినీ కాపాడగలిగితేనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కాపాడినట్టు అవుతుందని పేర్కొన్నారు. వ్యవసాయంతోపాటు పరిశ్రమలు కూడా జీడీపీకి దోహదపడతాయని… గతంలో హడావిడి ఎక్కువగా ఉండేదన్నారు. పెద్ద పెద్ద సదస్సులు పెట్టేవారని.. కాగితాల మీదే అగ్రిమెంట్లు అని తెలిపారు.  ఏమీ జరక్క ముందే మైక్రోసాఫ్ట్‌ వచ్చేసింది, ఎయిర్‌బస్‌ వచ్చేసింది అని హడావుడి చేసేవారని పేర్కొన్నారు జగన్‌.