నిమ్మగడ్డ రమేష్ కుమార్ వర్సెస్ వైకాపా

-

  • అధిపత్య పోరు వల్ల రాష్ట్రంలో మార్పులేంటి?
  • పంచాయతీ ఎన్నికల నిర్వహణపైనే నిమ్మగడ్డ మొగ్గు ఎందుకు చూపారు?
  • నిమ్మగడ్డ వైకాపా ప్రభుత్వ పోరులో బలవుతున్నది ఎవరు?
  • బాబు, నిమ్మగడ్డల అసలు దోస్తాన్ ఎంటీ ?
  • బీజేపీ, టీడీపీ వైకాపాల రాజకీయం రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేనా?

అమరావతి: గత కొంత కాలంగా రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు విపరీత ధోరణులకు దారి తీస్తున్నాయని స్పష్టంగానే తెలుస్తోంది. మరీ ముఖ్యంగా అధికార పార్టీ వైకాపా.. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ల మధ్య యవ్వారం తీవ్ర పరిణామాలకే దారితీసింది. ఒకానోక సమయంలో రాజ్యాంగ స్వతంత్ర ప్రతిపత్తి గలిగిన సంస్థలో విధులు నిర్వహిస్తున్న ఎన్నికల కమిషనర్ ను సైతం ప్రభుత్వం విధుల నుంచి తొలగించేందుకు నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రభుత్వంపై నిమ్మగడ్డ బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్ ప్రభుత్వం ..నిమ్మగడ్డను మధ్య చోటుచేసుకున్న ఈ అంశంతో పాటు పలు ఇతర విషయాలకు సంబంధించి కోర్టులు కూడా జోక్యం చేసుకున్నాయి. అయితే, వీటిలో న్యాయస్థానాల తీర్పులు నిమ్మగడ్డకు అనుకూలంగా రావడంతో అధికార పార్టీ వైకాపాపై గాయం మీద కారం చల్లినట్టుగా కావడంతో మరింత అగ్గి రాజుకుంది.

అసలు నిమ్మగడ్డకు.. ప్రభుత్వాన్ని ఎందుకు ఈ అగాధాలు ఏర్పాడ్డాయి? ప్రభుత్వం ఆయన తీరుపట్ల ఎందుకు ఇలా ప్రవర్తిస్తోంది? నిమ్మగడ్డ.. జగన్ సర్కారును నిజంగానే టార్గెట్ చేశారా? అలా ఎందుకు? పంచాయతీ ఎన్నికలు.. కరోనా పరిస్థితులు.. రాజకీయ పార్టీలు.. నేతలు తీరు రాష్ట్ర ప్రజల ప్రయోజనారిగా ఉంటాయా? ఇలాంటి అనేక ప్రశ్నలు ఇప్ఫుడు రాష్ట్ర ప్రజల మదిలో మెదులుతున్నాయి.

ఎవరీ నిమ్మగడ్డ? సర్కారుతో వైరం ఎందుకొచ్చింది?

నిమ్మగడ్డ రమేష్ కుమార్ 1982 ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ బ్యాచ్ అధికారి. ఆయన తన సుదీర్ఘ కెరీర్‌లో వివిధ విభాగాలలో పనిచేశాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత 2016 ఏప్రిల్ 1న ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమితులయ్యారు. రాజ్యాంగబద్ధమైన పదవి ఎస్ఈసీ గా కొనసాగుతున్న నిమ్మగడ్డ, ప్రజలచే ఎన్నుకోబడి వైకాపా ప్రభుత్వం మధ్య చిలికి చిలికి గాలివానలా ఇరువురి వైరం మారిందని చెప్పాలి. రాష్ట్రంలో స్థానిక సంస్ధల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడం.. సహజంగానే అధికారపార్టీకి ఉండే కొన్ని ప్రత్యేక వెసులుబాటుల మూలంగా వారు అత్యధికస్థానాలల్లో ఏకగ్రీవంగా గెలుచుకోవడం, ఆ వెనువెంటనే ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కరోనా విజృంభణ నేపథ్యంలో ఎన్నికలను అర్ధంతరంగా వాయిదా వేయటం.. నిమ్మగడ్డపై అధికారి పార్టీ నేతలు తీవ్రంగా మిర్శలు చేయడం చకచక జరిగిపోయాయి.

ఇక అధికార పార్టీ నేతలతో పాటు స్వయంగా సీఎం జగనే నిమ్మగడ్డపై.. విమర్శలు చేస్తూ… చంద్రబాబు మనిషి కావడంతోనే ఏన్నికలు వాయిదా వేశారంటూ ఆరోపించారు. దీనిని సీరియస్ గా తీసుకున్న నిమ్మగడ్డ.. సీఎం జగన్ ఫ్యాక్ష‌నిస్ట్ అంటూ కేంద్రం ఎన్నికల సంఘాని లేక రాయడం తీవ్ర దుమారమే రేపింది. మరీ ముఖ్యంగా అప్పటి టీడీపీ నేతలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాసరావులతో నిమ్మగడ్డ ఓ హోటల్లో రహస్యంగా సమావేశం కావడం.. దీనికంతటికి కారణం టీడీపీనే అనీ… నిమ్మగడ్డ చంద్రబాబు తొత్తు అంటూ వైకాపా నేతలు తీవ్రంగానే స్పందించారు.

నిమ్మ‌గ‌డ్డ తొల‌గింపు.. కోర్టులు తీర్పులు.. !

ఈ నేపథ్యంలోనే జగన్ సర్కారుకు.. నిమ్మగడ్డకు మధ్య తీవ్ర అగాధం ఏర్పడింది. ఇక జగన్ ప్రభుత్వం నిమ్మగడ్డలొల్లిని ఎలాగైనా తొలగించుకోవాలనే క్రమంలో ఓ ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా ఎస్ఈసీ పదవి నుండి నిమ్మగడ్డను తొలగించి తమిళనాడుకు చెందిన హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తిని ఆ స్థానంలో కూర్చోబెట్టారు. అయితే, నిమ్మగడ్డ సుప్రీంకోర్టుకు వెళ్లడంతో ఆయనకు అనుకూలంగా న్యాయస్థానం తీర్పు వచ్చింది. ఎలాగు 2021లో నిమ్మగడ్డ రిటైర్ అవుతారులే అనుకుని ప్రభుత్వం కూడా పెద్దగా పట్టించేకోలేదు. అయితే, సర్కారు తీరుపై అప్ప‌టికే గరంగరంగా ఉన్న నిమ్మగడ్డ.. ఎలాగైనా తాను రిటైర్ అయ్యేలోపు రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు జ‌రపాల‌ని కంకణం కట్టుకున్నట్టు ముందుకు సాగారు. అయితే, ఎట్టిపరిస్థితుల్లోనూ నిమ్మగడ్డ ఉన్నకాలంలో ఎన్నికలు జరగకూడదని జగన్ సర్కారు నిర్ణయాలు తీసుకుంటూ వచ్చింది.

అయితే, నిమ్మగడ్డ మాత్రం ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకోగా.. రాష్ట్ర ప్రభుత్వం కరోనా నేపథ్యంలో సాధ్యం కాదని స్ఫష్టం చేస్తూ.. ఏపీ సీస్ నీలం లేఖ రాయడంతో.. ఏపీ ప్రభుత్వంపై హైకోర్టులో ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు నిమ్మగడ్డ. ఈ నేపథ్యంలోనే వీరి మధ్య వివాదం పతాక‌ స్థాయికి చేరుకంది. నిమ్మగడ్డ రాష్ట్ర గవర్నర్ కు ఫిర్యాదు చేయడం, అయితే, న్యాయస్థానాల్లో ఆయనకే అనుకూలంగా తీర్పు రావడంతో వెనువేంటనే ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు.

ఎన్నిక‌లు.. నిమ్మగడ్డ వర్సెస్ వైకాపా.. ప్రజా ప్రయోజనాలు.. !

ఇక తాజాగా రాష్ట్రంలో జరగబోయే పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నిమ్మగడ్డ వర్సెస్ వైకాపా నేతల వ్యవహారం మరింతగా ముదిరింది. ఎన్నికలు, ఏకగ్రీవాలు, వాలంటీర్ల విషయాలపై నిమ్మగడ్డ తీసుకున్న పలు నిర్ణయాల పట్ల బాహాటంగానే అధికార పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తున్నారు. మరీ ముఖ్యంగా గమనించాల్సింది ఎన్నికల కమిషన్, ప్రభుత్వం మధ్య నెలకొన్న వైరం గురించి కాదు.. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల గురించి. నిమ్మగడ్డ తీరును గమనిస్తే.. ఎలాగైనా అధికార పార్టీపై తన పై చేయి ఉండాలనే రీతిలో ఆయన నిర్ణయాలు ఉంటున్నాయనేది బహిరంగమే. ఇక వైకాపా సైతం అదే తీరున ముందుకుక సాగుతూ.. నిమ్మగడ్డపై తీవ్ర ఆరోపణలు చేస్తోంది.

ఇదిలా ఉండగా… చంద్రబాబు వ్యవహారంలో కూడా నిమ్మగడ్డ తీరు అనుకూలంగా ఉందనే విధంగానే కనిపిస్తోంది. ఎందుకంటే పార్టీలతో సంబంధం లేకుండా సాగే పంచాయతీ ఎన్నికలకు టీడీపీ మేనిఫెస్టో విడుదల చేయడం.. అధికార నేతల ఫిర్యాదులు చేసి.. పలు ఆరోపణలు చేసేంత వరకూ బాబుపై చర్యలు, వివరణలు కోరకపోవడం గమనించాల్సిన విషయం. ఇక బీజేపీ, జనసేనలు గుడులు, గోపురాలు, దేవాలయాలు అంటూ మత రాజకీయాలకు తెరలేపడం రాష్ట్రంలో ఆందోళన కలిగించే విషయంగా విశ్లేషకులు భావిస్తున్నారు.

మరీ ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో ఎన్నికల అత్యంత కీలకమైనవి. అయితే, నేడు ఏకగ్రీవాల పేరిట మళ్లీ పల్లెల్లో కుల పెద్దలు, మత పెద్దలు, ఊరి పెద్దమనిషులు అనేవి ఈ ఎన్నికల్లో కనిపించకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు ఎన్నికల కమిషన్, ప్రజా నాయకులపై కూడా ఉంది. కానీ రాష్ట్రంలో నేడు కనిపిస్తున్న తీరు దీనికి విరుద్ధంగా ఉందని స్పష్టంగానే తెలుస్తోంది. తాజాగా పలువురు నేతలు అభ్యర్థులను బెదిరించడం, ఏకగ్రీవాలపై నాయకులు చేసే ప్రసంగాలే నిదర్శనం. ఇది అధిపత్య ధోరణికి తెరలేపే అవకాశముంది. వైకాపా వర్సెస్ నిమ్మగడ్డ వ్యవహారంతో ఎక్కువ ఇబ్బందులు పడుతున్నది ప్రజలు.. ప్రభుత్వ ఉద్యోగులే..

మరో వైపు రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగడం కూడా ఆందోళన కలిగించే అంశం. కానీ ఎన్నికలపై పార్టీలు, నేతలు, ఎన్నికల కమిషన్.. పంచాయతీ లొల్లిపై  దృష్టి సారించి ప్రజా ప్రయోజనాలను గాలికి వొదిలేశాయనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలుచేసుకుంటున్నారు గానీ ప్రజ సమస్యలను పెద్దగా ప్రస్తవించడం లేదు. ఇదంతా ప్రజలు గమనించడం లేదా? అంటే పొరపాటే.. అయితే, నిత్యం జరుగుతున్న ప్రతి విషయం గమనించడమే ప్ర‌స్తుతం వారి వంతుగా మారింది.. !

Read more RELATED
Recommended to you

Latest news