ఏపీ సచివాలయ ఉద్యోగాలు.. దాదాపు లక్షన్నర పోస్టులు ఒకే నోటిఫికేష్ లో కొన్ని నెలలక్రితం ఉద్యోగార్ధులను ఊరించాయి. దాదాపు 20 లక్షల మంది ఈ పరీక్షలు రాశారు. ప్రభుత్వం రికార్డు సమయంలో ఈ పరీక్షలు నిర్వహించింది. అంతే త్వరగా ఫలితాలూ ఇచ్చింది. సీఎం జగన్ తన స్వహస్తాలతో ఈ గురువారం ఈ ఫలితాలు విడుదల చేశారు.
అయితే.. ఇప్పుడో బ్రేకింగ్ న్యూస్ కలకలం రేపుతోంది. అదే.. ఈ సచివాలయ ఉద్యోగాల పరీక్ష పత్రాలు లీకయ్యాయన్నది.. ఆంధ్రజ్యోతి పత్రిక ఈ విషయంపై ఇవాళ బ్యానర్ కథనం ప్రచురించింది. ఇవిగో ఆధారాలు అంటూ కొన్ని ఉదాహరణలు కూడా బయటపెట్టింది..
ఆ కథనం సారాంశం ఏంటంటే.. ఏపీపీఎస్సీలోనే పని చేసే ఉద్యోగులే పేపర్ లీక్ చేశారట. ఆ పరీక్ష పేపర్లు సిద్ధంచేసిన ఏపీపీఎస్సీలోనే వారు పనిచేస్తున్నారట. అంతేకాదు పేపర్లు తయారుచేసిన విభాగంలో పనిచేసే మహిళా ఉద్యోగి ఒకరు ఈ పరీక్షలకు హాజరయ్యారట. గురువారం విడుదలచేసిన సచివాలయ ఫలితాల్లో కేటగిరి-1లో టాప్ 1 ర్యాంకరు ఆమేనట!
ఏపీపీఎస్సీలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి ఇంట్లో దాదాపు అందరూ గ్రామ సచివాలయ పోస్టులకు అర్హత సాధించారట. ఆయన భార్య కాకుండా ఇంట్లో మరో ఇద్దరు మంచి ర్యాంకులు తెచ్చుకొన్నారట. పేపరు సంపాదించిన ఏపీపీఎస్సీలోని కొందరు ఉద్యోగులు.. దానిని గుట్టుగా ఉంచలేదు. బంధువులు, సన్నిహితులకూ లీక్ చేశారట.
పేపరు తయారీకి, పరీక్ష నిర్వహణకు మధ్యలో ప్రశ్నపత్రం ఓ రిటైర్డు అధికారి చేతికి పోయిందట. కేటగిరి-1లో టాప్ ర్యాంకర్ అనితమ్మ ఏపీపీఎస్సీలో పరీక్షల వ్యవహారాలు చూసే విభాగంలో అనితమ్మ ఔట్‌సోర్సింగ్ విధానంలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారట. ప్రశ్నపత్రం టైప్ చేసిందీ ఆమేనని కమిషన్ వర్గాలే అంటున్నాయట! దొడ్డా వెంకట్రామిరెడ్డి కేటగిరి-3లో ఫస్ట్ ర్యాంకరు, .కేటగిరి-1లో మూడో ర్యాంకరు. ఆయన సొంత అన్న ఏపీపీఎస్సీలో ఏఎస్‌వో గా పనిచేస్తున్నారట.
ఇప్పుడీ కథనం ఏపీలో కలకలం రేపుతోంది. దాదాపు 20 లక్షల మంది అభ్యర్థుల్లో ఆందోళన కలిగిస్తోంది. మరి దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.